హైదరాబాద్ : ఆ సీనియర్ పోలీస్ అధికారి నిబంధనలను ఉల్లంఘించి సొంత పనులకు కానిస్టేబుల్స్ ను వాడుకోవడమే కాదు ఆయన ప్రభుత్వ ఉత్తర్వులను కూడా ఖాతరు చేయరని రుజువైంది. ఆర్డర్లీ కానిస్టేబుల్ మురళీనాధ్ మృతికేసులో సస్పెండ్ అయిన ఆక్టోపస్ మాజీ బాస్ అదనపు డీజీపీ వివేక్ దూబే చెప్పా చెయ్యకుండా రాష్ట్రాన్ని వదిలి పోయారు. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకూ రాష్ట్రాన్ని వదిలి వెళ్ళరాదని ప్రభుత్వం సస్పెన్షన్ ఉత్తర్వులో స్పష్టంగా పేర్కొన్నా ఆయన దానిని బేఖాతరు చేశారు. ఆయన రాష్ట్రాన్ని వదిలి వెళ్ళారన్న సంగతి రాష్ట్ర పోలీసు అధికారులు ఎవరూ కూడా ప్రభుత్వానికి నివేదించలేదు. మురళీనాథ్ కేసు విచారణకు మధ్యప్రదేశ్ పోలీస్ బృందం హైదరాబాద్ వచ్చి నప్పుడు మాత్రమే ఈ సంగతి బయట పడింది.
అదనపు డీజీపీ వివేక్ దూబే నగరంలో లేకపోవడం పోలీస్ వర్గాల్లో సంచలనం కలిగించింది. ప్రభుత్వం జారీ చేసిన సస్పెండ్ ఉత్తర్వుల్లో వివేక్ దూబే హైదరాబాద్ ను వీడి వెళ్ళరాదని ఆదేశించింది. కానీ మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన పోలీసులు దూబే ను విచారించేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులో లేకపోవడం గమనార్హం. తన కుటుంబ సభ్యులతో కలసి దూబే నోయిడా వెళ్ళినట్లు మధ్యప్రదేశ్ బృందానికి స్థానిక పోలీసులు చెప్పారు. ఏపీ పోలీస్ బెటాలియన్ కు మురళీనాథ్ అనే పోలీస్ కానిస్టేబుల్ ను ఆర్డర్లీ పేరిట నోయిడా పంపగా అతను అనుమాన్సపద స్థితిలో మధ్యప్రదేశ్ లో మరణించి ఉండగా కనుగొన్న సంగతి తెలిసింది.