ఇస్రో చంద్ర `గ్రహణం' న్యూఢిల్లీ : నిజాన్ని చెప్పలేక, వైఫల్యాన్ని ఒప్పుకోలేక లోలోపలే సతమతమైపోయారు. దేశం గర్వించదగిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టు అర్ధాంతరంగా అర్ధాయుష్షుతో ముగిసిపోయిందని ప్రపంచానికి చెప్పడానికి తల్లడిల్లిపోయారు. భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం(ఇస్రో) శాస్త్రజ్ఞులు దాదాపు నాలుగు నెలలుగా గరళాన్ని గళంలోనే దాచుకున్నారు. చంద్రయాన్-1 అంతరిక్షనౌక పెట్టిన క్షోభ అంతా ఇంతా కాదని ఇప్పుడు అంటున్నారు. ఇస్రొ చైర్మన్ మాధవన్ నాయర్ ఆఖరుకు చంద్రయాన్ ముగిసిపోయిందని ప్రకటించిన అనంతరమే అందరూ హమ్మయ్యా అంటూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం నిరుపయోగంగా చంద్ర కక్ష్యలో చంద్రునికి వంద కిలోమీటర్ల ఎత్తులో ఈ నౌక పరిభ్రమిస్తున్నది. ఈ నౌక నెమ్మదిగా చంద్రుని ఆకర్షణకు గురై మరో రెండేళ్ళ తరువాత చంద్రుని ఉపరితలంపై కూలిపోతుంది.
చంద్రయాన్-1 నౌకలో అమర్చిన వివిధ పరికరాలకు విద్యుత్ ను సరఫరా చేసే వ్యవస్థ గత ఏప్రిల్ లో చెడిపోయిందని, అప్పటి నుంచి నౌకలో తలెత్తిన సమస్యల్లో రేడియో సంబంధాలు తెగిపోవడం వాటిలో భాగం మాత్రమేనని శాస్త్రజ్ఞులు వివరించారు. వంద కిలోమీటర్ల కక్ష్య నుంచి చంద్రయాన్ పంపిన సమాచారాన్ని నిపుణులు విశ్లేషిస్తున్నారు. నౌకలో మొట్టమొదటి వైఫల్యాన్ని గుర్తించిన ఇస్రో కక్ష్య దూరాన్ని రెండు వందల కిలోమీటర్లకు పెంచింది. ఎందుకంటే వంద కిలోమీటర్ల దూరం వలన ఉష్ణోగ్రత అధికమై, ఎలక్ట్రోమేగ్నటిక్ రేడియేషన్ ప్రభావం కారణంగా విద్యుత్ పరికరం చెడిపోయి ఉంటుందని ఊహించినందువల్ల ఈ చర్య తీసుకున్నారు. చంద్రుని ఉపరితలాన్ని సమగ్రంగా పరిశీలించడం, చంద్రని అంతర్భాగ నిర్మాణాన్ని అధ్యయనం చేయడం, ఖనిజ వనరులను గుర్తించడం, చంద్రుని పుట్టుక, దాని పూర్వోత్తరాలను పరిశోధించడం వంటి పనులు నిర్వర్తించడానకి చంద్రయాన్ నౌకలో పరికరాలను అమర్చారు. వీటిలో ఐదు పరికరాలను భారత్ స్వయంగా అభివృద్ధి చేసినవి కాగా మరో అయిదింటిని విదేశాలు సమకూర్చాయి.
Pages: 1 -2- News Posted: 31 August, 2009
|