సంఘ్ సెగల్లో బీజేపీ న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) జోక్యంపై పార్టీలో భిన్నాభిప్రాయాలు నెలకొన్నాయి. పార్టీలో సంఘ్ జోక్యం చేసుకొని, సదా నియంత్రించాలని ఒక వర్గం భావిస్తుంటే, భాజపా స్వతంత్ర వైఖరితో వ్యవహరించాలని మరో వర్గం వాదిస్తోంది. పార్టీలో ఇటీవల పెరిగిన సంఘ్ జోక్యం - స్వతంత్ర ఉనికి కోసం పార్టీ చేస్తున్న ప్రయత్నాలకు గండి కొడుతుందని ఇంకొందరు ఆందోళన చెందుతున్నారు.
సంఘ్ జోక్యం ఏమేరకు ఉంటుందన్నది తదుపరి పార్టీ అధినేతను అనుసరించి ఉంటుంది. సంఘ్ జోక్యాన్ని నివారించడం అంత సులభం కాదు. దీనివల్ల రాష్ట్రాల్లో పలు అధికార కేంద్రాలు నెలకొనేందుకు ఆస్కారం లభిస్తుంది. ఇలా జోక్యం చేసుకోవడం వాజ్ పేయి ప్రభుత్వ హయాం నుంచీ ఉంది. అయితే, అప్పట్లో పరిమితంగా జోక్యం కనిపించేది. సోమవారం ఆర్ఎస్ఎస్ మాజీ అధినేత సుదర్శన్ - అద్వానీల సమావేశంలో కూడా ఇది ప్రస్తావనకు వచ్చింది. తదుపరి వారసుని ఎంపికల నేపథ్యంలో పార్టీలో వ్యక్తిగత విమర్శలు జోరందుకున్నాయి. దీంతో వైరి వర్గాల కట్టడిని సంఘ్ జోక్యం అనివార్యమైంది. దరిమిలా సంఘ్ నిర్ణయం కోసం అన్ని వర్గాలు ఆసక్తిగా చూస్తున్నాయి.
Pages: 1 -2- News Posted: 1 September, 2009
|