టెన్త్ సిలబస్ లో మార్పులు న్యూఢిల్లీ : కేంద్ర మాధ్యమిక విద్యా మండలి (సిబిఎస్ఇ)లో పదవ తరగతి బోర్డు పరీక్షలను ఆప్షనల్ చేయాలని, వచ్చే విద్యా సంవత్సరం నుంచి సిబిఎస్ఇ పాఠశాలల్లో గ్రేడింగ్ పద్ధతిని ప్రవేశపెట్టాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి (హెచ్ఆర్ డి) శాఖ మంత్రి కపిల్ సిబల్ చేసిన ప్రతిపాదనకు కేంద్ర విద్యా విషయక సలహా మండలి (సిఎబిఇ) ఆమోదముద్ర వేసింది. సిఎబిఇ సోమవారం ఢిల్లీలో సమావేశమైంది.
ఈ ప్రతిపాదనలను సిబిఎస్ఇ అమలుపరిచే తీరును అధ్యయనం చేయాలని బోర్డు నిర్ణయించినట్లు సిబల్ తెలిపారు. వీటిని ఆతరువాత వివిధ రాష్ట్రాలలో అమలు జరపనున్నట్లు ఆయన తెలిపారు. పరీక్షలకు సంబంధించిన సంస్కరణలను సిబిఎస్ఇ వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు జరపగలదని మంత్రి చెప్పారు.
పిల్లలపైనే ఎక్కువగా దృష్టి పెడుతూ సిఎబిఇ సోమవారం సమావేశంలో ప్రధానమైన విద్యా సంస్కరణలకు ఆమోదముద్ర వేసింది. 2005 నాటి జాతీయ పాఠ్యప్రణాళిక పరిధి ప్రాతిపదికగా తమ పాఠశాలల పాఠ్యప్రణాళికలను, పాఠ్యాంశాలను, పాఠ్యగ్రంథాలను సవరించాలని అన్ని రాష్ట్రాలను సిఎబిఇ కోరింది. సిబల్ ఇటీవల సూచించిన విధంగా గణిత, విజ్ఞాన శాస్త్రాలలో దేశవ్యాప్తంగా ఒకే పాఠ్యప్రణాళికను అనుసరించవలసిన ఆవశ్యకత ఉందని సిఎబిఇ ఉద్ఘాటించింది.
దేశంలో అత్యున్నత విద్యా విషయక సలహా సంస్థ అయిన సిఎబిఇ తన ఈ 56వ సమావేశంలో ఉన్నత విద్య, పరిశోధన కోసం స్వతంత్ర ప్రతిపత్తి గల ఒక ప్రాధికార సంస్థను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనకు కూడా ఆమోదం తెలియజేసింది. ఈ సంస్థ నియంత్రణ సంబంధిత విధుల నుంచి విధాన సంబంధిత విధులను వేరు చేయాలని ప్రతిపాదించారు. కాగా, ఉన్నత స్థాయి విద్యా సంస్థల నియామకాలలో రాజకీయ ప్రమేయం లేకుండా చేసే యత్నంగా సిఎబిఇ విశ్వవిద్యాలయాల వైస్ చాన్స్ లర్ (విసి)లు, ఇతర అకడమిక్, పరిశోధన విభాగాల పదవులు, ప్రతిపాదిత ఉన్నత విద్య, పరిశోధన ప్రాధికార సంస్థ చైర్ పర్సన్లు, సభ్యుల ఎంపిక కోసం పేర్లను సిఫార్సు చేయడానికై ప్రముఖ వ్యక్తులతో ఒక మండలిని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను కూడా ఆమోదించింది.
Pages: 1 -2- News Posted: 1 September, 2009
|