అంగట్లో అన్నీ ఉన్నా... నిర్మల్ : 'అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని' చందంగా మారింది ఇప్పుడు కాకతీయ కెనాల్ ఆయకట్టు కింద పొలాలు ఉన్న రైతుల పరిస్థితి. వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పటిష్టమైన బందోబస్తు మధ్య విద్యుత్ ప్రాజెక్టుకు నీటిని తరలించాల్సిన పరిస్థితి ఎదురైంది. పక్కనే సాగునీరు కదలిపోతున్నా ఉపయోగించుకోలేక, కరెంటు లేక భూగర్భజలాలనూ వాడుకోలేని దుస్థితి అన్నదాతలకు ఏర్పడింది.
నాలుగు రాష్ట్రాల విద్యుత్ అవసరాలు తీర్చే రామగుండం థర్మల్ పవర్ కేంద్రానికి ఇటీవలి వర్షాభావ పరిస్థితుల వల్ల నీటి కొరత పట్టి పీడిస్తోంది. నెల రోజులకు సరిపడిన నీటి నిల్వలు ఎప్పుడూ ఉంచుకునే థర్మల్ పవర్ స్టేషన్ వర్షాభావం వల్ల కొత్త నీరు రాకపోవడంతో ఉన్న నీటినే వాడేసుకుంది. మూడు రోజులుగా రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసి కొత్త నీరు రాకపోతే నాలుగు రాష్ట్రాలు అంధకారంలో మునిగిపోయేవే. ఆ సమయంలో కరుణించిన వరుణుడు సాగు, తాగునీరు మాట ఎలా ఉన్నా నాలుగు రాష్ట్రాల్లో కమ్ముకోనున్న చీకట్లను తొలగించే విధంగా నీటిని అందించాడు.
రామగుండంలోని ఎన్టీపిసికి శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుండే నీటి సరఫరా జరుగుతుంది. వారం రోజుల క్రితం శ్రీరాంసాగర్ లో నీటిమట్టం డెడ్ లెవల్, అంటే 1045 అడుగులు ఉండేది. దీంతో నీటిని విడుదల చేసే అవకాశం లేదని గ్రహించిన ఎన్టీపిసి అధికారులు కేంద్ర ప్రభుత్వానికి 15 రోజులు క్రితమే లేఖ రాశారు. మహారాష్ట్రలోని గోదావరిపై ఉన్న ప్రాజెక్టుల్లోని నీటిని ఎన్టీపిసి అవసరాల కోసం వదిలేలా చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు. కానీ ఆ అవసరం లేకుండానే గత వారం రోజులుగా మహారాష్ట్రతో పాటు అంతటా విస్తారంగా కురుస్తున్న వర్షాలకు గోదావరి పరవళ్ళు తొక్కింది. శ్రీరాంసాగర్ లో నీరు వచ్చి చేరింది. గత వారం రోజులుగా ఈ ప్రాజెక్టులోకి ఐదు వేల క్యూసెక్కుల నీరు ప్రతిరోజూ వచ్చి చేరుతోంది.
Pages: 1 -2- News Posted: 1 September, 2009
|