గాలింపు సేనాని చిదంబరం న్యూఢిల్లీ : ముఖ్యమంత్రి వైఎస్ కోసం గాలింపును కేంద్ర హోం మంత్రి చిదంబరం యుద్ధ క్షేత్రంలో సైనికునిలానే నిర్వహించారు. వైఎస్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ రాడార్ తెరల మీద నుంచి అదృశ్యం అయిందని తెలిసిన మరుక్షణంలోనే చిదంబరం రంగంలోకి దూకారు. వివిధ వర్గల నుంచి వస్తున్న సమాచారంపై ఆధారపడవద్దని ముందుగా ఆయన తన అధికారలకు సూచించారు. కేవలం వాస్తవం లభించే సమాచారాన్ని, ఒకరి ఆదేశాలను మాత్రమై పాటించాలని ఆదేశించారు. దాంతో ఆంధ్రప్రదేశ్ నుంచి క్షణం క్షణం వస్తున్న అనేక రకాల అయోమయ సమాచారాన్ని కేంద్ర అధికారులు పట్టించుకోవడం మానేశారు. వైఎస్ ఆచూకీని స్పష్టంగా, నిర్ధిష్టంగా కనిపెట్టడం అనే ఏకైక లక్ష్యం మీదే దృష్టిని కేంద్రీకరించారు. చివరి వరకూ కూడా సైనిక, పౌర విభాగాల అధికారులు కేవలం హోం మంత్రి చిందంబరం ఆదేశాలను మాత్రమే పాటించారు. ఆయనకు మాత్రమే ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరవేశారు.
అంతకుముందు వైఎస్ హెలికాప్టర్ పై ఆంధ్రప్రదేశ్ లోని టెలివిజన్ చానళ్ళు రకరకాల కథనాలను ప్రసారం చేశాయి. అసలు ఏం జరిగిందో అర్ధం కాకుండా తెలిసీతెలియని వర్గాల నుంచి సేకరించిన ఊహాగాన సమాచారాన్నివాస్తవాలుగా చెబుతూ పోయాయి. హెలికాప్టర్ అత్యవసరంగా దిగిపోయిందని, మరో గంటలోనో రెండు గంటల్లోనో ముఖ్యమంత్రి చిత్తూరు చేరతారని, కాలినడకన బయలుదేరారని, ఆత్మకూరు చేరిపోయారని, మళ్ళీ అంతలోనే జాడ దొరకలేదని చెప్పుకుంటూ పోయారు. దానిని ఆధారం చేసుకుని వైఎస్ కార్యదర్శి భాస్కర శర్మ బుధవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి క్షేమమని ప్రకటించేశారు. అలానే హైదరాబాద్ లోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఎటిసి)కూడా అలాంటి సమాచారన్నే పంపింది. దీనిని ఆధారం చేసుకున్న కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి ప్రఫుల్ పటేల్ కూడా హెలికాప్టర్ సురక్షితమని ప్రకటించేశారు.
Pages: 1 -2- News Posted: 4 September, 2009
|