స్నేహానికి సెలవా? హైదరాబాద్ : స్నేహానికి నిలువెత్తు నిజరూపం వైఎస్. ఆయనను సన్నిహితంగా గమనించిన వారు, ఆయనతో కొద్దిసేపైనా మాట్లాడిన వారు కూడా ఇదే మాట చెబుతారు. ఎదుటి వ్యక్తిని స్నేహపూర్వకంగా, ఆప్యాయంగా, ఆత్మీయంగా పలకరించడం వైఎస్ వ్యక్తిత్వంలోని ప్రత్యేకత. వైఎస్ తనను నమ్ముకున్న వాళ్ళకు ఆపద్భాందవుడు. చెదరని, చెరగని స్నేహ సంపదను పంచివ్వడం వైఎస్ కు వెన్నతో పెట్టిన విద్య. దానికి ఉదారహణలు బోలెడు. అందులో కెవిపి తో నిజమైన స్నేహితునిగానూ, అంటిపెట్టుకుని ఉండే సూరీడుతో ఆత్మబంధువుగానూ బంధనాలు తెంపుకోలేని బంధాలను కొనసాగించడం వైఎస్ కే చెల్లింది. వారిద్దరూ అంతగా ఆయన ఆత్మలో మమేకమైన ఆత్మీయులు కాబట్టే వైఎస్ కడపటి ప్రయాణంలో వారిని కూడా తీసుకువెళ్ళలేదు కాబోలు. ఏడుగురు ఎక్కే అవకాశం ఉన్నా, వెంట వస్తానన్న సూరీడును, కేవీపీని తరువాత తాపీగా రండి అని చెప్పి ఆయన అనంత లోకాలకు పయనమైపోయారు.
మనుషులు ఇద్దరు అయినా మనసు ఒక్కటే... హృదయాలు రెండు... వాటిలోని భావం అభిప్రాయం ఒక్కటే. కష్టాలను కలిసి పంచుకున్నారు... సుఖాలను కలిసి పంచుకున్నారు. వారే ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి, డాక్టర్ కెవిపి రామచంద్రరావు. తెరవెనుక ఉండి వైఎస్ ను రాజకీయంగా ముందుకు నడిపించే ఇంథనం కెవిపి. వారిద్దరి బంధం, అనుబంధం నాలుగు దశాబ్దాల నాటిది. విద్యార్థి దశ నుంచి నేటి వరకు విడదీయరాని బంధం వారిద్దరిది. రాష్ట్రంలో ఉన్నా, దేశంలో ఉన్నా, విదేశంలో ఉన్నా ప్రతిరోజు ఉదయమే ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా ఒక్క రోజైనా ఉండలేరు. వారి స్నేహం నిస్వార్థమైనది కాబట్టే దశాబ్దాలు గడచినా, కొందరు చాడీలు చెప్పినా చెక్కుచెదరలేదు. డాక్టర్ చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒకసారి ఆయన వద్దకు వైఎస్ వెళ్లారు. ఆయన వెంట కెవిపి కూడా ఉన్నారు. కెవిపిని చూసిన చెన్నారెడ్డి ఆయన ఎందుకు అనగా 'ఆయన నా ఆత్మ' అని వైఎస్ సగర్వంగా చెప్పుకున్నారు. వైఎస్ ను సరదాకైనా ఎవ్వరైనా ఒక్కమాట అంటే సహించని మనస్తత్వం కెవిపిది. అలాగే కెవిపి గురించి ఎవరైనా ఏదైనా చెబితే పట్టించుకోని మనస్తత్వం వైఎస్ ది. అన్ని దశాబ్దాల వారి స్నేహ జీవితంలో 2009 సెప్టెంబర్ రెండో తేదీ ఒక చీకటి రోజు. ఆప్త మిత్రుల స్నేహ బంధాన్ని ప్రకృతి సహించలేకపోయింది. నిర్దయంగా వారిని విడదీసింది.
Pages: 1 -2- News Posted: 4 September, 2009
|