'అన్నదాత' బోర్లాగ్ కన్నుమూత డల్లాస్ : వ్యవసాయ శాస్త్రవేత్త, ప్రపంచానికి అన్నం పెట్టిన వ్యక్తిగా ప్రసిద్ధిగాంచిన నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, హరిత విప్లవ పితామహుడు, పద్మవిభూషణ్ నార్మన్ బోర్లాగ్ తుది శ్వాస విడిచారు. క్యాన్సర్ తో బాధపడుతున్న ఆయన 95వ యేట టెక్సాస్ లోని డల్లాస్ లోగల తన నివాసంలో అమెరికా కాలమానం ప్రకారం శనివారం ఉదయం 11 గంటలకు తుది శ్వాస విడిచినట్లు బోర్లాగ్ మనుమరాలు తెలిపారు. ఆయనకు ఒక కుమార్తె, కుమారుడు, ఐదుగురు మనవళ్ళు, మనువరాళ్ళు, 12 మంది మునిమనవళ్ళు, మునిమనవరాళ్ళు ఉన్నారు. అధిక దిగుబడులనిచ్చే వంగడాలను కనుగొని అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఆకలి సమస్యకు పరిష్కారం చూపిన గొప్ప వ్యవసాయ శాస్త్రవేత్త అయిన బోర్లాగ్ ను 1970లో నోబెల్ శాంతి బహుమతి లభించింది. 20వ శతాబ్దపు రెండవ అర్ధభాగంలో ఆయన తీసుకొచ్చిన 'హరిత విప్లవం' దాదాపు 100 కోట్ల జీవితాలను కాపాడిందని చెబుతారు.
హరిత విప్లవం కారణంగా 1960 - 1990 మధ్య ప్రపంచ ఆహార ధాన్యాల ఉత్పత్తి రెట్టింపు కాగా, భారత్, పాకిస్థాన్ దేశాలలో నాలుగు రెట్ల కంటే ఎక్కువగానే పెరిగింది. అందుకే భారత ప్రభుత్వం ఆయనను 2006లో 'పద్మ విభూషణ్'తో సత్కరించింది. 1914లో మార్చి 25న లోవాలోని క్రెస్కోలో ఒక వ్యసాయ క్షేత్రంలో జన్మించిన ఆయన వ్యవసాయానికి సేవ చేయడమే తన జీవిత ధ్యేయంగా ఎంచుకున్నారు. జనాభా విస్ఫోటనంతో పెద్ద ఎత్తున ఆకలిచావులు తప్పవని ప్రపంచమంతా ఆందోళన చెందుతున్న 1960లలో ఆయన తీసుకొచ్చిన హరిత విప్లవం ఆహార సమస్యకు చక్కని పరిష్కారం చూపింది. అధిక దిగుబడినిచ్చే వంగడాల రూపకల్పనే ఆహార సమస్యకు పరిష్కారమని ఆయన భావించారు. రైతు అనుకూల విధానాలను రూపొందించి వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించేందుకు అవసరమైన మార్కెట్ సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చారు.
Pages: 1 -2- News Posted: 14 September, 2009
|