యుజిసి 'డీమ్డ్' పొరబాట్లు న్యూఢిల్లీ : అనర్హమైన విద్యా సంస్థలు హల్చల్ సాగించేందుకు వాటికి డీమ్డ్ యూనివర్శిటీ (డియు) ప్రతిపత్తి మంజూరు చేయడంలో యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యుజిసి) చట్టాన్ని తప్పుగా అన్వయించుకున్నదని, హేతుబద్ధంగా వ్యవహరించలేదని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి (హెచ్ఆర్ డి) మంత్రిత్వశాఖ నిర్వహించిన ఒక సమీక్షలో అభిప్రాయపడినట్లు తెలుస్తున్నది. కొంత వరకు కొత్త సంస్థలకు కూడా డీమ్డ్ యూనివర్శిటీ హోదాను మంజూరు చేయడంలో ఔచిత్యాన్ని కూడా కపిల్ సిబల్ మంత్రిత్వశాక నివేదిక ప్రశ్నించవచ్చునని ఉన్నత స్థాయి ప్రభుత్వ వర్గాలు సూచించాయి. డీమ్డ్ యూనివర్శిటీలను అనుమతించడం వెనుక ఆశయాన్ని 'సరిగ్గా అర్థం చేసుకోకపోవడం' వల్ల పలు కొత్త విద్యా సంస్థలకు ఈ హోదా మంజూరు చేసినట్లు ఈ సమీక్షలో తేలిందని ఆ వర్గాలు వివరించాయి.
ఒక ప్రైవేట్ డీమ్డ్ యూనివర్శిటీ పరిధిలో వివిధ విద్యా సంస్థలలో ఒకే అధ్యాపకులు పని చేస్తున్న ఉదంతాలు కూడా ఈ సమీక్షలో బయటపడింది. అంటే విద్యా సంస్థ ఫ్యాకల్టీ గురించి విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నారన్నమాట. డీమ్డ్ యూనివర్శిటీ హోదా మంజూరు కోసం వచ్చిన అభ్యర్థనలను పరిశీలించి తదనుగుణంగా సిఫార్సు చేసేందుకు నిపుణుల బృందాలను పంపిస్తుండే యుజిసిదే నాసిరకం ప్రైవేట్ ఉన్నత విద్యా సంస్థలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోవడానికి బాధ్యత అని ఈ నివేదిక పేర్కొంటున్నది. అయితే, ఈ నివేదిక నేరుగా ఆ బాధ్యతను యుజిసికి ఆపాదించలేకపోవచ్చు. ఎందుకంటే ఇది మంత్రిత్వశాఖను కూడా ఇరకాటంలోకి నెట్టవచ్చు. యుజిసి సిఫార్సుల ఆధారంగా డీమ్డ్ యూనివర్శిటీ హోదాను చివరగా మంజూరు చేసేది మంత్రిత్వశాఖే.
92 ప్రైవేట్ డీమ్డ్ యూనివర్శిటీలలో 81 యూనివర్శిటీలపై సమీక్షను ఈ సమీక్ష బృందం పూర్తి చేసింది. మిగిలిన సంస్థలపైన, ప్రభుత్వ నిధులు అందే 38 ఇన్ స్టిట్యూషన్లపైన సమీక్షను కూడా బృందం సెప్టెంబర్ 24 నాటికి పూర్తి చేయనున్నది. కేంద్ర హెచ్ఆర్ డి శాఖ మంత్రి కపిల్ సిబల్ జూన్ 4న ఈ సమీక్షకు ఆదేశించారు. అన్ని హంగులు కల విశ్వవిద్యాలయాలుగా తమను తాము పేర్కొంటూ విద్యార్థులను అయోమయంలోకి నెట్టేందుకు వీలు కల్పించే ఒక వివాదాస్పద ఉత్తర్వును ఉపసంహరించాలని కూడా యుజిసిని హెచ్ఆర్ డి మంత్రిత్వశాఖ ఆదేశించింది.
Pages: 1 -2- News Posted: 14 September, 2009
|