ఆ జిల్లాల్లో భూ సేకరణ రద్దు! న్యూఢిల్లీ : దేశంలోని నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలైన 90 జిల్లాల్లో భూసేకరణ చేయరాదన్న ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. పశ్చిమ బెంగాల్ లో సింగూర్, నందిగామ, లాల్ గఢ్ లో ప్రైవేట్ ప్రాజెక్టులకోసం భూసేకరణ వల్ల 2007 నుంచి హింసాత్మకంగా మారిన పరిస్థితులు కేంద్రం వైఖరిలో మార్పులు తెచ్చాయి. గతంలో బెంగాల్ లో భూసేకరణకు వ్యతిరేకంగా ఉద్యమించిన కేంద్రమంత్రి మమతా బెనర్జీ కూడా ఇదే డిమాండ్ చేశారు.
ముఖ్యకార్యదర్శి కెం.ఎం.చంద్రశేఖర్ నాయకత్వంలోని నిపుణుల బృందం కూడా ప్రజా సంక్షేమం, జాతీయ భద్రతకు సంబంధించి మాత్రమే ప్రభుత్వం నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో భూసేకరణ చేయాలని సూచించింది. ఆయా ప్రాంతాల్లో నిరాశ్రులయ్యే సంఖ్య తగ్గించడం, వారి హక్కులకు భద్రత కల్పించే క్రమంలో ఈ ప్రతిపాదనలను నిపుణుల కమిటీ చేసింది. కార్పొరేట్ సంస్థలతో పాటు సహకార సంఘాలకోసం కూడా భూమిని సేకరించరాదని ఈ కమిటీ అభిప్రాయపడింది.
Pages: 1 -2- News Posted: 15 September, 2009
|