ప్రభుత్వం పడకేసింది హైదరాబాద్ : పరిపాలన కుంటినడక నడుస్తోంది. మంత్రులు రాకపోవడంతో సచివాలయం వెలవెలబోతుంది. మంత్రులు ముఖం చాటేయడంతో అధికారులు కూడా గోళ్ళు గిల్లుకుంటున్నారు. మరో పక్క ప్రభుత్వ పాలనా వ్యవహారాలు స్తంభించి పోయాయంటూ ప్రతిపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఈనెల రెండో తేదీన హెలికాప్టర్ ప్రమాద దుర్ఘటనలో మరణించిన అనంతరం దాదాపుగా మంత్రులు, అధికారులు తమ విధులనే మర్చిపోయినట్లు కనిపిస్తోంది. ప్రతిరోజూ సగం కన్నా తక్కువ మంది మంత్రులు మాత్రమే సచివాలయానికి వస్తుండగా, మిగిలిన వారు వివిధ కారణాలను చెబుతూ సచివాలయానికి దూరంగా ఉంటున్నారు.
వైఎస్ మరణించి రెండువారాలు కావస్తుండడం, కొత్తగా ముఖ్యమంత్రి బాధ్యతలు రోశయ్య స్వీకరించి పది రోజులు దాటినప్పటికీ ఎక్కడా పాలనాపరమైన కదలికలు కనిపించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొత్త ముఖ్యమంత్రి ఎవరన్న అంశంపై ఇంకా స్పష్టత లేకపోవడం, జగన్ ను ముఖ్యమంత్రి చేయాలంటూ కొంతమంది మంత్రులు గట్టిగా కోరుకుంటుండగా, మరికొందరు ఎటూ తేల్చుకోలేక తటస్థంగా ఉండిపోవడంతో సచివాలయంలో పాలన కనిపించడంలేదని భావిస్తున్నారు.
కాగా, ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న రోశయ్య సమీక్షలు నిర్వహిస్తున్నా పలువురు మంత్రులు అకారణంగా గైర్హాజరు అవుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. సమీక్షల సమయంలో తాము ఇతర కార్యక్రమాల్లో ఉన్నందున హాజరుకాలేకపోతున్నామని పలువురు మంత్రులు వివరణలు ఇచ్చుకుంటుండగా, వారు తనకు చెప్పే వెళ్ళారని రోశయ్య కూడా మంత్రులను వెనకేసుకు రావాల్సి వస్తోంది. ఇప్పటివరకు ఒకరిద్దరు మంత్రులు లాంఛనంగా కూడా ముఖ్యమంత్రిని కలవలేదన్న విమర్శలు వస్తున్నాయి. మంత్రులు గతంలో మాదిరిగా సచివాలయానికి రాకపోవడంతో ముఖ్యమంత్రిగా రోశయ్యే అధికారులను పిలిపించి సమీక్షలు నిర్వహించాల్సి వస్తోంది. ఇది కూడా కొంతమంది మంత్రులకు కన్నెర్రగా మారుతోందన్న ప్రచారం జరుగుతోంది.
Pages: 1 -2- News Posted: 16 September, 2009
|