గడ్డంపై కేసీఆర్ సీరియస్! హైదరాబాద్: మంచిర్యాల ఎమ్మెల్యే గడ్డం అరవింద్ రెడ్డిపై తెలంగాణా రాష్ట్ర సమితి అధిష్టానం వేటు వేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. తెరాస పార్టీ శాసనసభా పక్ష నాయకుడు ఈటెల రాజేందర్‌ను లక్ష్యంగా చేసుకుని ఇటీవల మంచిర్యాలలో అరవింద్ రెడ్డి చేసిన కొన్ని కటువైన ఆరోపణలు పార్టీని తీవ్ర ఇరకాటంలో పడేశాయి . ఈటెల శాసనాసభా పక్ష నాయకుడిగా పనికి రారని అరవింద్ రెడ్డి ఆరోపించారు. అక్కడితో ఆగకుండా కేవలం 10 మంది ఎమ్మెల్యేలతో తెలంగాణ వస్తుందా అని ప్రశ్నించారు. ఉద్యమాల బాటలో నడవటం లేదని రెడ్డి మండిపడ్డారు.
పార్టీ అధిష్టాన నిర్ణయాలను ఎద్దేవా చేస్తూ అరవింద్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెరాస అధినేత కెసిఆర్ శనివారం మంచిర్యాలలో ప్రజాకోర్టు నిర్వహించి ఎవరి సంగతి ఏమిటో చూసుకుంటామని హెచ్చరించారు. ఆ తర్వాత శుక్రవారం అరవింద్ తన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేశారని, క్షమాపణ చెప్పారని వివరించి ప్రజా కోర్టును రద్దు చేశారు. అయితే తాను ఎలాంటి క్షమాపణా చెప్పలేదని, ఆ అవసరం తనకు లేదని, కెసిఆర్‌ను సైతం కలిసేది లేదని అర వింద్ రెడ్డి శనివారం మరో ప్రకటన చేశారు. ప్రజా కోర్టు పెడితే బాగుండేదని, ఎవరి సంగతి ఏమిటో తేలేదని వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు.
Pages: 1 -2- News Posted: 19 September, 2009
|