ప్రభువులకు 'పేదల' బెడద! న్యూఢిల్లీ : భారతదేశంలోని గ్రామీణ పేదల సంఖ్య రెట్టింపు కానుంది. గ్రామీణ పేదలు 28 శాతం ఉన్నట్లుగా ప్రణాళికా సంఘం ప్రకటిస్తే ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ గ్రామీణుల్లో సగం మందికి పైగా పేదరికంలో మగ్గుతున్నారని అభిప్రాయపడింది. దీంతో కేంద్రం ప్రణాళికా సంఘం గణాంకాలనే అనుసరించి పథకాలు అమలు చేస్తుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఎన్ సి సక్సేనా కమిటీ గణాంకాల ప్రకారం అయితే కేంద్రం పేదరిక నిర్మూలన పథకాలకు నిధులను ఇబ్బడిముబ్బడిగా కేటాయించాల్సి ఉంటుంది. పేదరికంలో మగ్గుతున్న కుటుంబాలను గుర్తించేందుకు విధి విధానాల ఖరారుకు నియమితులైన సక్సేనా కమిటీ గత నెలలో గ్రామీణాభివృద్ధి మంత్రి సీపీ జోషికి నివేదిక సమర్పించింది. ప్రభుత్వం పేదలను గణించాలని కమిటీని కోరలేదని, పేదల గుర్తింపునకు విధానాన్ని రూపొందించాలని మాత్రమే సూచించిందని మంత్రి సీపీ జోషి చెప్పారు. ఈ నివేదికకు ప్రభుత్వం ప్రభావితం కాదన్నారు. దీంతో నిపుణుల కమిటీ పేర్కొన్న గణాంకాలనే కాకుండా పేదలను గుర్తించేందుకు సూచించిన విధానాన్ని కూడా ప్రభుత్వం తిరస్కరించే అవకాశముందని కొందరు పేర్కొంటున్నారు.
పేదల గుర్తింపు నుంచి మినహాయించేందుకు అయిదు అంశాలను కమిటీ గుర్తించింది. గ్రామీణ ప్రాంతాల్లో అయితే 700 రూపాయలు, పట్టణప్రాంతాల్లో అయితే 1000 రూపాయలు సగటు వ్యయం చేయడంతో పాటు, పక్కా ఇల్లు కలిగి ఉండడం, ద్విచక్రవాహనం సొంతది కావడం, ట్రాక్టర్ కలిగి ఉండడం, జిల్లాలో తలసరి భూమికన్నా ఎక్కువ భూమి కలిగి ఉంటే వారిని పేదలుగా గుర్తించరు. తలసరి వ్యయం విషయంలో ప్రణాళికా సంఘానికి, నిపుణుల కమిటీకి లెక్కల తేడా ఉంది. తలసరి వ్యయాన్ని పట్టణాల్లో 539 రూపాయలు, గ్రామాల్లో 356 రూపాయలుగా ప్రణాళికా సంఘం పేర్కొంది. 2002 నాటి దారిద్య రేఖ దిగువన ఉన్నప్రజల శాతాన్ని మార్చకుండానే... గుర్తింపు విధానాన్ని సూచించడమే సక్సేనా కమిటీ లక్ష్యం.
Pages: 1 -2- News Posted: 21 September, 2009
|