జూలియా పూజ, భక్తుల తిప్పలు న్యూఢిల్లీ : ప్రముఖ హాలీవుడ్ నటి జూలియా రాబర్ట్స్ భారతదేశానికి వచ్చి హిందువులైన గ్రామస్థులకు ఆగ్రహం తెప్పిస్తున్నది. హిందూ దేవాలయంలో తన కొత్త చిత్రం కోసం ఆమె కొన్ని దృశ్యాలను చిత్రీకరించుకుంటుండగా హిందూ భక్తులను అత్యంత ముఖ్యమైన పండుగ సమయంలో ఆలయంలోకి వెళ్ళనివ్వడం లేదు. ఢిల్లీకి సమీపంలోని ఆశ్రమ్ హరి మందిర్ లో నవరాత్రి ప్రారంభ వేడుకలను జరుపుకోవాలని ఆశించిన గ్రామస్థులను ఆలయంలోకి ప్రవేశించనివ్వకుండా జూలియా రాబర్ట్స్ వెంట ఉన్న 350 మంది భద్రతా సిబ్బంది రక్షణ వలయం ఏర్పాటు చేశారు. ఆమె కోసం బుల్లెట్ ప్రూఫ్ కార్లను, ఒక హెలికాప్టర్ ను కూడా అక్కడ నిలిపారు.
ఇక్కడ విచిత్రమేమిటంటే జూలియా తన చిత్రం 'ఈట్, ప్రే, లవ్' కోసం ఈ ప్రాంతానికి వచ్చింది. ఆమె చిత్రంలో హిందూ ఆధ్యాత్మికతతో మనశ్సాంతి పొందాలని ఆశిస్తున్న మహిళగా పాత్ర పోషిస్తున్నది. స్థానిక భక్తులకు సదా ప్రవేశానుమతి లభిస్తుండే ఆలయంలోకి ఆమె చిత్రం షూటింగ్ కారణంగా వారిని రానివ్వడం లేదు.
'భక్తులకు ప్రవేశం నిషేధించారు. ఉదయం మేము లోపలికి వెళ్ళి ప్రార్థన చేసుకోవాలనుకుంటే భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. ఏదో విధంగా లోపలికి వెళ్ళగలిగినవారు వెళ్ళారు. కాని మాలో చాలా మందిని వెనుకకు పంపివేశారు. ఇది నవరాత్రుల సమయం. ఆలయాన్ని సందర్శించకుండా మమ్మల్ని అడ్డుకోరాదు' అని శకుంతలా దేవి అనే భక్తురాలు అన్నది. భద్రతా వలయాన్ని ఛేదించుకుని లోపలికి వెళతానని మరొక గ్రామస్థుడు బెదరించాడు. 'సాయంత్రం హారతి సమయానికి నేను లోపలికి వెళ్ళబోతున్నాను. నన్ను ఎవరు అడ్డుకుంటారో చూస్తాను. మమ్మల్ని మా ఆలయంలోకి కనీసం రానివ్వకుండా వారేమి షూటింగ్ చేసుకుంటారు' అని అతను అన్నాడు.
Pages: 1 -2- News Posted: 23 September, 2009
|