హైదరాబాద్ : ముఖ్యమంత్రి వైఎస్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన అనంతరం రాష్ట్ర కాంగ్రెస్ లో సంభవిస్తున్న పరిణామాలు 'వర్గాల' సమీకరణ దిశగా సాగుతున్నాయి. వైఎస్ మృతి చెందిన వెంటనే ఆయన కుమారుడు జగన్ ను సీఎం చేయాలన్న వైఎస్ వర్గం వాదనను ఢిల్లీ నాయకత్వం పట్టించుకోలేదు. ముఖ్యమంత్రిగా రోశయ్య నియామకం తాత్కాలికమని భావించినా... అది శాశ్వతమేనన్న సంకేతాలను పరోక్షంగా ఏఐసీసీ వర్గాలు చెప్పాయి. 'ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి వున్నారు... పాలన సాగుతోంది' అని చెప్పడం ద్వారా సీఎంను ఇప్పట్లో మార్చేదిలేదన్న సూచనలను ఢిల్లీ అధిష్టానం ఇప్పటివరకు పంపింది.
తాజాగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో తరచూ ముఖ్యమంత్రులను మార్చడం పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఇష్టం ఉండదని ముఖ్యమంత్రి రోశయ్య చెప్పడం ద్వారా అధిష్టానం మనోగతాన్ని బహిర్గతం చేసినట్లైంది. 1996లో తాను పీసీసీ అధ్యక్షుడుగా ఉండగానే జరిగిన ఎన్నికల్లో 26 స్థానాలు గెలిచిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తద్వారా తాను బలహీనుడను కాదని పరోక్షంకా చెప్పారు. మరోవైపు కర్నూలు జిల్లా నల్లకాలువ వద్ద నిర్వహించిన వైఎస్ సంస్మరణ సభలో 'నాన్న కలలు నిజం చేద్దాం. రండి!' అంటూ జగన్ పిలుపు నిచ్చారు. వైఎస్ దివంగతులైన తర్వాత జగన్ బహిరంగ సభలో మాడ్లాటడం ఇదే తొలిసారి.