కండోమ్ గుర్తా? సారీ! చండీగఢ్ : ఎన్నికల చిహ్నాలు 'సేవ్ గోవా ఫ్రంట్' గుర్తు విమానంలా ఎగరవచ్చు లేదా ఫార్వర్డ్ బ్లాక్ గుర్తు సింహంలా గర్జించనూ వచ్చు. ఏ అభ్యర్థి అయినా స్వయంగా శంఖం (బిజూ జనతా దళ్ గుర్తు)ను పూరించవచ్చు లేదా సొంత డ్రమ్ (మేఘాలయ యునైటెడ్ డెమోక్రాటిక్ పార్టీ గుర్తు)ను వాయించవచ్చు. అదే కండోమ్ అయితే? కూడదు... కూడదు...
హర్యానా శాసనసభ ఎన్నికలలో కర్నాల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఇండిపెండెంట్ అభ్యర్థి ఆనంద్ ప్రకాశ్ శర్మ సురక్షిత సెక్స్ కు ఉపకరించే కండోమ్ గుర్తును కేటాయించాలని అడిగితే అలా చేయజాలమని ఎన్నికల కమిషన్ (ఇసి) అధికారులు స్పష్టం చేశారు. దానికి బదులుగా 'క్యాండిల్' (కొవ్వొత్తి) గుర్తును కేటాయిస్తామని వారు సూచించారు. రొమాన్స్ కు సంబంధించినంత వరకు 'క్యాండిల్ లైట్ డిన్నర్' కూడా శ్రేష్టమైనదేనని బహుశా ఇసి భావించి ఉంటుంది.
బ్యాట్, అలమారా, బ్యాటరీ, టార్చి, దువ్వెన, మహిళల పర్సు, ప్రెషర్ కుక్కర్ వంటి రోజూ ఉపయోగించే వస్తువులు, చివరకు ఫోర్క్, చేతి కర్ర కూడా ఎన్నికల చిహ్నాల అధికారిక జాబితాలో చోటు చేసుకున్నప్పుడు కండోమ్ కు అందులో స్థానం కల్పించకపోవడం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఆనంద్ ప్రకాశ్ శర్మ గురువారం ప్రధాన ఎన్నికల కమిషనర్ (సిఇసి) నవీన్ చావ్లాకు ఒక లేఖ రాశారు.
'కండోమ్ లను ఉపయోగించడం ద్వారా సురక్షిత సెక్స్ పద్ధతులను అనుసరించవలసిందిగా జనాన్ని కోరుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటనలపై కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తుండగా దేశంలో ఎన్నికలలో పోటీ చేసేందుకు దానిని ఒక చిహ్నంగా ఉపయోగించుకునేందుకు అనుమతించకపోవడం విచిత్రంగా ఉంది' అని 45 సంవత్సరాల శర్మ 'ది టెలిగ్రాఫ్' పత్రిక విలేఖరితో అన్నారు.
ఆనంద్ ప్రకాశ్ శర్మ హిందీలో చావ్లాకు రాసిన లేఖలో ఎన్నికల చిహ్నాల జాబితాలో 'నిరోధ్'ను కూడా చేర్చాలని విజ్ఞప్తి చేశారు. 'మీరు ఎంత త్వరగా కండోమ్ ను ఆ జాబితాలో చేరుస్తారో సమాజానికి, దేశానికి అంత మంచిది' అని శర్మ తన లేఖలో సూచించారు. 'కుటుంబ సభ్యులంతా కలసి టివి ప్రకటనలు చూడగలిగినప్పుడు, కండోమ్ ల గురించి దిన పత్రికలు, మ్యాగజైన్ లలో చదవగలిగినప్పుడు ఎన్నికల చిహ్నంగా కండోమ్ ను ఉపయోగించడాన్ని వారు ఎందుకు అంగీకరించరో నాకు అర్థం కావడం లేదు. ఇది హెచ్ఐవి / ఎయిడ్స్ గురించి చైతన్యం కలిగించగలదు, జనాభా పెరుగుదలను నిరోధించగలదు...' అని శర్మ తన లేఖలో పేర్కొన్నారు.
Pages: 1 -2- News Posted: 2 October, 2009
|