కోటీశ్వరుల కాంగ్రెస్! చండీగఢ్: డబ్బు సంచులతోనే సామాన్య మానవుని అభిమానాన్ని చూరగొనగలమని కాంగ్రెస్ పార్టీ విశ్వసిస్తున్నట్లున్నది. హర్యానా శాసనసభకు ఈ నెల 13న జరగనున్న ఎన్నికలలో కాంగ్రెస్ నిలబెట్టిన 90 మంది అభ్యర్థులలో 72 మంది కోటీశ్వరులే. కాంగ్రెస్ పార్టీ కోటీశ్వరుల జాబితా చూడముచ్చటగా ఉన్నప్పటికీ ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు కూడా నిజానికి బికారులేమీ కాదు. ఈ ఎన్నికలకు ప్రధాన రాజకీయ పార్టీలు నిలబెట్టిన అభ్యర్థులలో సగం మందికి పైగా కోటి రూపాయలకు పైగా విలువ చేసే ఆస్తులు తమకు ఉన్నట్లు ప్రకటించారు. వారి సంఖ్య 2005 ఎన్నికలలో కన్నా ఐదింట దాదాపు ఒక వంతు అధికం.
నేషనల్ ఎలక్షన్ వాచ్, 1200 ఎన్ జిఒలతో కూడిన ప్రజాస్వామిక సంస్కరణల సంఘం (ఎడిఆర్) ఒక సర్వేను నిర్వహించాయి. కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ (బిజెపి), భారత జాతీయ లోక్ దళ్ (ఐఎన్ఎల్ డి), బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్ పి), సమాజ్ వాది పార్టీ (ఎస్ పి), హర్యానా జన్ హిత్ కాంగ్రెస్ తో సహా ప్రధాన రాజకీయ పార్టీల తరఫున బరిలో ఉన్న 489 మంది అభ్యర్థులు ఎన్నికల కమిషన్ (ఇసి)కి సమర్పించిన అఫిడవిట్ల ఆధారంగా జరిగిన సర్వే ఇది.
హర్యానా అభ్యర్థుల ఎంపికలో రాహుల్ గాంధికి పాత్ర ఉందని ఇటీవలి వార్తలు సూచిస్తున్నాయి. వారిని ఎంపిక చేయడానికి డబ్బు సంచులు ఒక అర్హత కాకపోయి ఉండవచ్చు కాని దళితుల ఇళ్ళలో రాత్రిళ్ళు బస చేస్తూండడానికి, చివరకు వారి ఆహారం కూడా భుజిస్తుండడానికి, 90 మంది అభ్యర్థులలో 72 మంది కోటీశ్వరులు ఉండడానికి ఎక్కడా లింక్ దొరకడం లేదు. కోటీశ్వరులైన అభ్యర్థులు బారులు తీరడం ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో రాజకీయ నిజాయితీపరులను దిగ్భ్రాంతికి గురి చేస్తుండవచ్చు కూడా.
Pages: 1 -2- News Posted: 5 October, 2009
|