ఈ అధ్యక్షుడు నష్టజాతకుడు! జకార్తా : మూఢ నమ్మకాలు అమితంగా గల ఇండోనీసియన్లు తమ దేశంలో తాజాగా సంభవించిన భూకంపానికి అధ్యక్షుని 'దురదృష్ట' జాతకమే కారణమని అంటున్నారు. దేశాధ్యక్షుడు సుశీలో బంబంగ్ యుధోయునో చాలా కాలంగా ఒక అపప్రథను ఎదుర్కొంటున్నారు. ఆయన జన్మ తేదీని 'దురదృష్టాన్ని' తీసుకువచ్చేదిగా ఇండోనీసియన్లు నిందిస్తున్నారు. ఆయనను ఎస్ బివై అనే ఇంగ్లీష్ పొడి అక్షరాలతో సంబోధిస్తుంటారు.
2004లో ఆయన ఎన్నికైనప్పటి నుంచి ఇండోనీసియాలో ప్రకృతి వైపరీత్యాలు, మానవ కారక వైపరీత్యాలు వరుసగా సంభవిస్తుండడంతో ఎసి బివై అంటే 'సెలాలు బెన్కానా యా' (ఎప్పుడూ ఏదో ఒక వైపరీత్యం) అని వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తున్నారు. ఆసియా అంతటా 2.20 లక్షల మందిని బలిగొన్న హిందూ మహాసముద్రం సునామీ ఆ వైపరీత్యాలలో ఒకటి.
తొమ్మిది అంకెను అనేక మంది దురదృష్టకరమైనదిగా పరిగణిస్తుంటారు. తాజాగా సంభవించిన భూకంపాన్ని కూడా చాలా మంది అందుకు నిదర్శనంగా పేర్కొంటున్నారు. ఆయన జన్మ తేదీ 1949 సెప్టెంబర్ 9. కనుక ఆయన గ్రహగతి బాగా లేదని వారంటున్నారు.
ప్రతిపక్ష గెరింద్రా పార్టీకి చెందిన వెటరన్ రాజకీయ నాయకుడు, భూతవైద్యుడు పెర్మాడి ఈ విషయమై వ్యాఖ్యానిస్తూ, 'ప్రింబన్ (జావాకు సంబంధించిన అనుభూతివాద పంచాంగం) ప్రకారం, తన జన్మతేదీ కారణంగా ఎస్ బివై ఈ దేశానికి ఎప్పుడూ వైపరీత్యాలకు కారకుడవుతుంటారు' అని పేర్కొన్నారు. 'ఆయన జనన తేదీలో అంకెలు ఒకసారి పరికించండి. తొమ్మిదవ నెల తొమ్మిదవ తేదీ. 1949 సంవత్సరం. అది దురదృష్టకరమైనది. ఆయన ఎంత ఎక్కువగా అధికారాన్ని అంటిపెట్టుకుని ఉంటే అంత ఎక్కువగా ఈ దేశాన్ని వైపరీత్యాలు పట్టి పీడిస్తాయి' అని పెర్మాడి అన్నారు. యుధోయునో అధ్యక్షుడుగా కొనసాగినట్లయితే 'జకార్తాను తప్పకుండా ఇంకా తీవ్రమైన వైపరీత్యం పీడించగలదు' అని పెర్మాడి ఇండోనీసియా రాజధానిని ప్రస్తావిస్తూ సూచించారు. 'ఎస్ బివై సహృదయుడైనట్లయితే ఆయన పదవిలో నుంచి తప్పుకోగలరు' అని పెర్మాడి అన్నారు.
Pages: 1 -2- News Posted: 5 October, 2009
|