సిఎంఒ అత్యుత్సాహం! హైదరాబాద్ : రాష్ట్రంలో వరద బాధిత ప్రాంతాల ఏరియల్ సర్వేకు తెలుగు దేశం పార్టీ (టిడిపి) అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కన్నా ముందుగా ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య బయలుదేరేట్లు చూడాలనుకుని ముఖ్యమంత్రి కార్యాలయం (సిఎంఒ)లోని సీనియర్ అధికారి ఒకరు ప్రదర్శించిన అత్యుత్సాహమే ఆదివారం హెలికాప్టర్ కోసం సిఎం దాదాపు గంట సేపు నిరీక్షించడానికి కారణమని తెలుస్తున్నది. వరద బాధిత ప్రాంతాలను హెలికాప్టర్ లో నుంచి పరిశీలించేందుకు ఆదివారం బేగంపేట విమానాశ్రయం చేరుకున్న రోశయ్య హెలికాప్టర్ ఆలస్యం కావడంతో దాదాపు గంట సేపు విమానాశ్రయంలోనే వేచి ఉండవలసి వచ్చింది.
సిఎంఒ పాత్ర కూడా ఉన్నప్పటికీ ఈ జాప్యానికి ఆంధ్ర ప్రదేశ్ ఏవియేషన్ కార్పొరేషన్ (ఎపిఎసి) మేనేజింగ్ డైరెక్టర్ కె.వి. బ్రహ్మానందరెడ్డి బాధ్యుడని భావిస్తూ ఆయనను సస్పెండ్ చేయాలని సిఎంఒ నిర్ణయించింది. సిఎంఒ అధికారులు జన్నత్ హుస్సేన్, ఎం. ప్రతాప్ చేసిన ఫోన్ కాల్స్ కు బ్రహ్మానందరెడ్డి స్పందించలేదని తనకు తెలియజేసినప్పుడు ముఖ్యమంత్రి ఆయనపై ఆగ్రహం చెందారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు జె.సి. దివాకరరెడ్డి, డి.కె. సమరసింహారెడ్డి కూడా ఎండి వైఖరిపై ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసినట్లు అభిజ్ఞ వర్గాలు తెలియజేశాయి.
అయితే, వాస్తవమేమంటే హెలికాప్టర్ సిద్ధంగా లేదని తెలిసి కూడా సిఎంఒ రోశయ్యను హడావుడిగా విమానాశ్రయానికి పంపింది. చంద్రబాబు నాయుడు కన్నా ముందుగా రోశయ్య బయలుదేరేట్లు చూడాలన్నదే వారి తపన. ముఖ్యమంత్రి సచివాలయంలో తన వాహనంలోకి ఎక్కబోతున్న సమయంలో హెలికాప్టర్ ఆలస్యం గురించి ఆయనకు సమాచారం అందజేశారని మీడియా విచారణలో తెలిసింది.
హెలికాప్టర్ ఆలస్యం గురించి, బ్రహ్మానందరెడ్డి నిర్లక్ష్యం గురించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి. రమాకాంతరెడ్డికి సిఎంఒ ఒక ఫిర్యాదు అందజేసింది. దీనిపై సంజాయిషీ ఇవ్వవలసిందిగా బ్రహ్మానందరెడ్డిని ప్రధాన కార్యదర్శి ఆదేశించారు.
బళ్ళారికి ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ వస్తున్న దృష్ట్యా అక్కడికి ముఖ్యమంత్రి వెళ్ళనున్నందున హెలికాప్టర్ ను సిద్ధంగా ఉంచవలసిందిగా కార్పొరేషన్ కు సిఎంఒ తొలుత సూచించినట్లు ఆ వర్గాలు తెలిపాయి. కాని ఆతరువాత ఈ అభ్యర్థనను రద్దు చేశారు. 'రోశయ్య ఏరియల్ సర్వే గురించి, గన్నవరం విమానాశ్రయంలో ఆయన దిగాలనుకోవడం గురించి కార్పొరేషన్ కు సిఎంఒ ఉదయం 11.40 గంటలకు తెలియజేసింది' అని ప్రతినిధి ఒకరు చెప్పారు. 'హెలికాప్టర్ దిగే ప్రదేశం మారింది. ఆ విషయాన్ని మధ్యాహ్నం 12.15 గంటలకు కార్పొరేషన్ కు తెలియజేశారు. ఆతరువాత హెలికాప్టర్ ప్రయాణ మార్గాన్ని మార్చవలసి వచ్చింది' అని ఆయన వివరించారు.
Pages: 1 -2- News Posted: 6 October, 2009
|