చంద్రబాబు చొరవ! హైదరాబాద్ : తెలుగు దేశం పార్టీ (టిడిపి) అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తొమ్మిది సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా గడించిన విశేషానుభవం ఇప్పుడు ఆయనకు అక్కరకు వచ్చింది. రాష్ట్రంలో వరదల సమయంలోను చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడుగా విశిష్ట రీతిలో చొరవ ప్రదర్శించారు. ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించకుండా సంయమనం పాటిస్తూనే మరొకవైపు వరద బాధితులపై తన క్రియాశీలతతో అధికార యంత్రాంగంపై పరోక్షంగా ఒత్తిడి పెంచడంలో ఆయన కృతకృత్యులు కాగలిగారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. వరదలు మొదలైన రోజు నుంచి జిల్లాలలోని పార్టీ నాయకులతో టెలి కాన్ఫరెన్స్ లు, ముఖ్యమంత్రి నుంచి ప్రధాని వరకు అందరికీ ఫోన్లు, బాధితుల సమస్యలపై అధికారులకు లేఖలు, పార్టీ నాయకుల నుంచి విరాళాల సమీకరణ, వరద బాధిత ప్రాంతాలలో హెలికాప్టర్ పర్యటనలతో చంద్రబాబు సోమవారం వరకు క్షణం తీరిక లేకుండా గడిపారు.
ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రభుత్వం, అధికార యంత్రాంగం వైఫల్యాలపై ప్రతిపక్షం సాధారణంగా విరుచుకుపడుతుంటుంది. కాని రాష్ట్రంలోని ప్రస్తుత ప్రత్యేక రాజకీయ పరిస్థితుల దృష్ట్యా టిడిపి ఆ తరహా విమర్శల జోలికి పోలేదు. వరదలు ముంచెత్తుతున్న తరుణంలో తాము విమర్శనాస్త్రాలు సంధించబోమని, నిర్మాణాత్మక సలహాలు, సూచనలతో ప్రభుత్వానికి సహకరిస్తామని చంద్రబాబు ముందుగానే ప్రకటించారు. వరదలు కర్నూలు, మహబూబ్ నగర్ జిల్లాలను చుట్టుముడుతున్న సూచనలు ద్యోతకం కాగానే బాధితుల సహాయానికి సంసిద్ధులు కావాలని తమ పార్టీ శ్రేణులకు ఆయన ఎస్ఎంఎస్ లు పంపారు. ఆయన రోజూ ఉదయం, సాయంత్రం జిల్లాలలోని పార్టీ నాయకులతో టెలి కాన్ఫరెన్స్ లు నిర్వహించి వరదల పరిస్థితి, సహాయ కార్యక్రమాల గురించి తెలుసుకోవడంతో పాటు సురక్షిత ప్రాంతాలకు బాధితుల తరలింపు, వారికి కావలసిన సాయం విషయమై ఆ నాయకులను ప్రోత్సహించారు. చంద్రబాబు పదేపదే చెబుతుండడంతో పార్టీ నాయకులు కూడా పెద్ద సంఖ్యలో సహాయ కార్యక్రమాలకు ఉద్యుక్తులయ్యారు.
ఇక వరద ప్రాంతాలలో పరిస్థితిన అధికార యంత్రాంగం దృష్టికి తీసుకురావడానికై చంద్రబాబు తమ పార్టీ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు. దానికి అందిన సమాచారంపై తక్షణం లేఖలు సిద్ధం చేసి సచివాలయానికి పంపే ఏర్పాటు చేశారు. ఈ నాలుగు రోజులలో బాధితుల సమస్యలపై చంద్రబాబు నేరుగా ముఖ్యమంత్రికి రాసిన లేఖలు పదుల సంఖ్యలో ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలియజేశాయి. కర్నూలు జిల్లాలోని సిద్ధాపురం చెరువుకు సోమవారం కొద్దిగా గండి పడిన విషయం తెలియగానే చంద్రబాబు దానిపై వెంటనే ఒక లేఖను సిఎం కార్యాలయానికి పంపారు.
Pages: 1 -2- News Posted: 6 October, 2009
|