అక్కడ స్త్రీలదే ఆధిపత్యం నిజామాబాద్ : మహిళల శక్తి కోసం మీరు చూస్తుంటే నిజామాబాద్ జిల్లాకు వెళితే చాలు. నిజామాబాద్ జిల్లాలో పురుషుల కన్నా మహిళల జనాభా అధికంగా ఉండడమే కాకుండా మహిళా అధికారులు, రాజకీయ నాయకురాళ్ళ సంఖ్య కూడా ఎక్కువే. 2001 జనాభా లెక్కల ప్రకారం, జిల్లాలో పురుషుల జనాభా 11.62,905 కాగా మహిళల జనాభా 11,82,780. సెక్స్ నిష్పత్తి మహిళలకు వ్యతిరేకంగా ఉన్న దేశంలో ఈ విధమైన గణాంకాలు కనిపించడం అరుదే. ఇక జిల్లా వ్యాప్తంగా నమోదైన పురుష వోటర్ల సంఖ్య 7,34,858 కాగా మహిళా వోటర్ల సంఖ్య 8.29,126.
జిల్లాలో అధికార యంత్రాంగంలో కూడా మహిళలు ప్రముఖ స్థానాలలోనే ఉన్నారు. జిల్లా కలెక్టర్ కె. సునీత జిల్లాలో ప్రతి ప్రాంతాన్ని సందర్శిస్తూ ప్రజలతో మాట్లాడుతుంటారు. ఆమె అందుబాటులోఉంటారని, తమ సమస్యలు నివేదించడానికి అవకాశం ఇస్తుంటారని గ్రామీణ మహిళలు చెబుతుంటారు. మహిళా శక్తికి మరొక ఉదాహరణ బోధన రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ (ఆర్ డిఒ) కె. స్వర్ణలత. మంజీర, గోదావరి నదుల తీరాల నుంచి అక్రమ ఇసుక క్వారీని నిలిపివేయాలని ఆమె ఆదేశించారు. వెనుకబడిన బోధన్ డివిజన్ లో పర్యటిస్తూ స్వర్ణలత ప్రజలతో ముఖాముఖి సాగిస్తుంటారు. ప్రభుత్వం చేపట్టిన పనులు సత్వరం పూర్తయ్యేట్లుగా ఆమె చర్యలు తీసుకుంటుంటారు.
జిల్లా ముఖ్యమైన రవాణా కేంద్రం కూడా. ఏడవ నంబర్, 16వ నంబర్ జాతీయ రహదారులు జిల్లా గుండా వెళుతుంటాయి. పొరుగున ఉన్న మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలను అనుసంధానిస్తూ అంతర్ రాష్ట్ర రహదారులు కూడా ఉన్నాయి. రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ (డిటిసి) విజయలక్ష్మి అధికార యంత్రాంగం క్రమబద్ధీకరణపై దృష్టి కేంద్రీకరించారు. జిల్లా అధికార యంత్రాంగంలోని ఇతర మహిళా అధికారులలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ సుగుణ, మద్యనిషేధం, అబ్కారి శాఖ అసిస్టెంట్ కమిషనర్ అనసూయాదేవి, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి సావిత్రి, మహిళా ప్రాంగణం జిల్లా మేనేజర్ జయశ్రీ, మహిళా, శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ సరళ కుమారి కూడా ఉన్నారు.
Pages: 1 -2- News Posted: 6 October, 2009
|