కాంగ్రెస్ 'శ్వేత గజాలు' న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ యంత్రాంగంలో ఉత్తేజం నింపడానికి ప్రయత్నిస్తున్న రాహుల్ గాంధి ముందుగా ఆ పని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఎఐసిసి) ప్రధాన కార్యాలయంలో చేపట్టితే బాగుంటుంది. సంస్థను పటిష్ఠం చేయడం, పార్టీకి మద్దతు సమీకరించడం ప్రధాన బాధ్యత అయిన ఎఐసిసిలోని పలు విభాగాలు, సెల్స్ చాలా కాలంగా క్రియాశూన్యంగా ఉన్నాయి. పార్టీలో ఉన్నత స్థాయి నేతలకు ఇష్టులైన వ్యక్తులకు వసతి కల్పించేందుకు ఈ సెల్స్ చాలా వరకు అదపు గదులుగా మారిపోయాయి. కాని పార్టీలోని ఆఫీస్ బేరర్లలో కొద్ది మంది మాత్రం తమ విధులను శ్రద్ధగా నిర్వహిస్తుంటారు. ఎందుకంటే ప్రధాన కార్యదర్శిగా లేదా కార్యదర్శిగా ప్రధాన సెక్రటేరియట్ లోకి ప్రవేశించడం వారి లక్ష్యం.
'ఈ విభాగాలన్నీ శ్వేత గజాలుగా మారిపోయాయి. ఇవి అసలేపనీ చేయడం లేదు' అని ఈ సెల్స్ లో ఒకదాని అధికారి ఒకరు 'ది టెలిగ్రాఫ్' పత్రిక విలేఖరితో చెప్పారు. 'శాఖాధిపతులు కొందరు జిల్లా, బ్లాకు స్థాయిలలో నియామకాలు జరుపుతూ సంతుష్టి చెందుతున్నారు. ఇతరులు ఎఐసిసి కార్యాలయంలో తమ నేమ్ ప్లేట్లు చూసుకుంటూ ఆనందిస్తున్నారు. కొందరు కార్యదర్శులు తమ మిత్రులను కలుసుకోవడానికి ఆఫీసులను ఉపయోగించుకుంటుంటారు' అని ఆయన తెలిపారు.
ఇప్పుడు ఎఐసిసిలో కంప్యూటర్, న్యాయ, మేధావి విభాగాలు కాకుండా విదేశీ వ్యవహారాలు, మైనారిటీ వ్యవహారాలు, మీడియా, షెడ్యూల్డ్ కులాలు (ఎస్ సి), షెడ్యూల్డ్ తెగలు (ఎస్ టి), ఇతర వెనుకబడిన తరగతులు (ఒబిసిలు), పరిశోధన, రిఫరెన్స్, ఫిర్యాదులు, పాలిసీ ప్లానింగ్, సమన్వయం, శిక్షణ, పంచాయతీ రాజ్, రైతులు, కార్మికులు, మాజీ సైనికులకు సంబంధించిన 16 శాఖలు ఉన్నాయి.
మీడియాతో సమన్వయంతో వ్యవహరిస్తూ, ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తుండే మీడియా శాఖను మినహాయిస్తే ఈ శాఖలలో చాలా వాటికి తమ ఘనతలుగా చెప్పుకునేందుకు ఏవీ లేవు. నంబర్ 24, అక్బర్ రోడ్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వీటి ఆఫీసులు ఎప్పుడూ మూసి ఉంటాయి. వీటి అధికారులు ఎప్పుడో కాని కనిపించరు. కొన్ని శాఖాధిపతులు రకరకాల బాధ్యతల కారణంగా ఇతర ప్రదేశాలకే అంటిపెట్టుకుని ఉంటారు. కొందరైతే కేంద్ర మంత్రులైన తరువాత తమ ఆఫీసులను అనాథలుగా వదలివేశారు.
Pages: 1 -2- News Posted: 6 October, 2009
|