ఈ పంటలు పోతే ఎలా? న్యూఢిల్లీ : ఆంధ్ర ప్రదేశ్, కర్నాటక, మహారాష్ట్రలలో వరదల వల్ల కీలకమైన ధాన్యం, ఉల్లి, కూరగాయల పంటలకు అపారంగా నష్టం వాటిల్లింది. అయితే, ఈ నష్టం ఏమేరకు ఉందనేది మదింపు వేస్తున్నారు. ఇప్పటికే ఉత్తరాది రాష్ట్రాలలో అనావృష్టి వల్ల ధాన్యం, ఖాద్యతైలాల పంటలు దెబ్బతిన్నాయి. కాగా, ఖరీఫ్ ఉత్పత్తిలో మొత్తం లోటు కోటి 60 లక్షల టన్నులు ఉంటుందని అంచనా. ఉల్లిపాయలు, చెరకు, వేరుశనగ రీటైల్ ధరలు ఇప్పటికే మిన్నంటిన స్థాయిలో ఉండగా ఈ పంటలకు ఇప్పుడు వాటిల్లిన నష్టం వాటి లభ్యతపైన, ధరలపైన తీవ్ర ప్రభావాన్నే చూపవచ్చు.
బియ్యం అవసరాలను తీర్చడానికై దేశం బియ్యాన్ని దిగుమతి చేసుకోవలసి రావచ్చునని కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి కె.వి. థామస్ మంగళవారం ఢిల్లీలో సూచించారు. ప్రభుత్వం బియ్యంపై దిగుమతి సుంకాన్ని తగ్గించవచ్చునని కూడా ఆయన సూచించారు. వరి ధాన్యం సాగు నిరుటి కన్నా ఈ ఏడాది ఖరీఫ్ లో తక్కువగా ఉంది. నిరుడు 5.92 మిలియన్ హెక్టార్లలో ధాన్యం సాగు చేశారు. రాష్ట్ర ఆహార ప్రాసెసింగ్ శాఖ మంత్రుల సదస్సుకు హాజరైన మంత్రి ఆతరువాత విలేఖరులతో మాట్లాడుతూ, 'వరదల కారణంగా ధాన్యం, చెరకు ఉత్పత్తి తగ్గవచ్చు' అని చెప్పారు.
మూడు బాధిత రాష్ట్రాల వ్యవసాయ శాఖ కమిషనర్లు పరిస్థితిని మదింపు వేస్తున్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి టి. నందకుమార్ తెలియజేశారు. 'మేము పరిస్థితిని మదింపు వేస్తున్నాం. నీటి ప్రవాహం 72 గంటలలో తగ్గినట్లయితే, నష్టం ముందు ఊహించినట్లుగా ఉండకపోవచ్చు' అని ఆయన పేర్కొన్నారు.
Pages: 1 -2- News Posted: 7 October, 2009
|