జగన్ సిఎం కానట్లేనా? హైదరాబాద్: ముఖ్యమంత్రి పదవిపై జగన్ ఆశలు, జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలన్న ఆయన అనుయాయుల ఆశలపై పార్టీ అధిష్టానం నీళ్ళు గుమ్మరించబోతోంది. ముఖ్యమంత్రిగాను, కాంగ్రెస్ శాసన సభా పక్ష నాయకుడిగాను రోశయ్యను కొనసాగించేందుకు కాంగ్రెస్ అధిష్టానం పకడ్బందీగా వ్యూహాన్ని పన్నింది. రోశయ్య ముఖ్యమంత్రిగా కొనసాగడానికి ప్రధాన అవరోధంగా కనిపిస్తున్న కడప ఎంపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెక్ పెట్టడమే ఈ వ్యూహం ప్రధాన ఉద్దేశం. క్రియాశీలక రాజకీయాలలో నిండా ఏదాజి కూడా అనుభవం లేనందున జగన్ కు ముఖ్యమంత్రి వంటి అతి కీలకమైన పదవిని కట్టబెట్టి రాజకీయ పరమైన విమర్శలు, సమస్యలు కొనితెచ్చుకోవడం ఏమాత్రం శ్రేయస్కరం కాదని పార్టీ హైకమాండ్ ఒక నిశ్చితాభిప్రాయానికి వచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
అయితే ఇదే విషయం నేరుగా జగన్ మొహంపై చెప్పకుండా పార్టీ అధిష్టానం లౌక్యం ప్రదర్శించబోతోంది. అందులో భాగంగా రానున్న మూడు, నాలుగు రోజులలో పార్టీ హైకమాండ్ జగన్ ను ఢిల్లీకి పిలిపించాలని నిర్ణయించింది. జగన్ ఢిల్లీ వచ్చిన అనంతరం ముందుగా ఆయన పార్టీ సీనియర్ నాయకులను కలుసుకోవలసి ఉంటుంది. ఈ సమావేశంలో పార్టీ వైఖరిని వారు జగన్ కు వివరించి, నచ్చచెప్పే ప్రయత్నం చేస్తారు. పార్టీ ఆశించిన రీతిలో జగన్ స్పందిస్తేనే ఆయన సోనియా గాంధీని కలవడానికి అనుమతి లభిస్తుంది.
వైఎస్ మరణాంతరం (ఆపద్ధర్మ) ముఖ్యమంత్రిగా రోశయ్య పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి జగన్ అభ్యర్ధిత్వాన్ని బలపరిచిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీలోని వివిధ హోదాలలో ఉన్న నాయకులు సాగించిన రభసపై పార్టీ అధిష్టానం ఇదివరకే కన్నెర్ర చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా జగన్ ముఖ్యమంత్రి కావాలని పట్టుబట్టిన కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రోశయ్యను గడ్డిపోచ కింద జమకడుతూ వ్యవహరించిన తీరుపై అధిష్టానం లోలోపల రగులుతున్నట్లు వార్తలు వచ్చాయి. ఇక జగన్ కు చెక్ పెట్టకపోతే రోశయ్యకు అడుగడుగునా సంకటం తప్పదని గ్రహించిన పార్టీ అగ్రనాయకత్వం ఆ దిశగా అడుగులు వేసింది. పార్టీ అధ్యక్షురాలికి రాజకీయ సలహాదారు అయిన అహమద్ పటేల్, సీనియర్ నాయకుడు, ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ, కేంద్ర హోమ్ మంత్రి పి.చిదంబరంలతో ఒక కమిటీ ఏర్పాటైంది. త్వరలో ఢిల్లీ పర్యటించబోయే జగన్ ముందుగా ఈ త్రిసభ్య కమిటీతో భేటీ కావలసి ఉంది. దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం పార్టీకి అందించిన సేవలను ఎన్నటికీ విస్మరించజాలమని, వారి ప్రయోజనాలను పార్టీ తప్పకుండా పరిరక్షిస్తుందని జగన్ కు ఈ త్రిసభ్య కమిటీ హామీ ఇవ్వబోతోంది.
Pages: 1 -2- News Posted: 7 October, 2009
|