తొలి టెస్ట్ పాసైన రోశయ్య! హైదరాబాద్: నైట్ వాచ్ మన్ గా బరిలోకి దిగిన రోశయ్య ముఖ్యమంత్రిగా సుదీర్ఘమైన ఇన్నింగ్స్ ఆడేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. రోశయ్య లాంగ్ ఇన్నింగ్స్ ఆడేందుకు పార్టీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. వరద సహాయ చర్యలను చేపట్టే విషయంలో ముఖ్యమంత్రిగా రోశయ్య అద్భుతంగా పని చేసిందని పార్టీ అధిష్టానం భావిస్తున్నట్లు తెలిసింది. అలాగే కృష్ణా నది వరదలు నాలుగు జిల్లాలను అతలాకుతలం చేయబోతోందన్న తరుణంలో రోశయ్య రాత్రిళ్ళు కూడా సచివాలయంలోనే బస చేసి సహాయ, పునరావాస చర్యలను పర్యవేక్షించడం పట్ల పార్టీ అధిష్టానం మరింత సంతోషం వ్యక్తం చేసినట్లు తెలిసింది. తొలి టెస్ట్ లో రోశయ్య అధిష్టానం దగ్గర నూటికి నూరు శాతం మార్కులు సాధించారని ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకుడు వ్యాఖ్యానించడం గమనార్హం.
ఈ నేపధ్యంలో వరద పీడిత ప్రాంతాల సందర్శన కోసం వచ్చిన పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ స్వయంగా రోశయ్యను శభాష్ అని మెచ్చుకోవడం కూడా ఇక్కడ గమనించాల్సిన విషయమే. సోనియా హైదరాబాద్ రావడానికి ఒక రోజు ముందుగానే ఇక్కడికి చేరుకున్న పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి వీరప్ప మొయిలీ ముఖ్యమంత్రి రోశయ్యతో కొద్దిసేపు ఏకాంతంగా మాట్లాడారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రిగా రోశయ్యను పూర్తి కాలం కొనసాగించాలని పార్టీ అధిష్టానం యోచిస్తున్న విషయం మొయిలీ ఆయనకు చేరవేసినట్లు రోశయ్యకు అత్యంత కీలకమైన ఒక అనుచరుడు చెప్పారు. దీంతో రోశయ్య పరిపాలనపై పట్టు సాధించేందుకు కసరత్తు ప్రారంభించారు.
Pages: 1 -2- News Posted: 7 October, 2009
|