కత్తి దూసిన రోశయ్య హైదరాబాద్ : కృష్ణమ్మ శాంతించింది. ప్రజల బతుకులను కకావికలం చేసిన వరద వెనక్కుమళ్ళింది. కానీ... ముఖ్యమంత్రి రోశయ్య ఉగ్రరూపం దాల్చారు. ప్రజాపాలనను అతలాకుతలం చేస్తున్న అధికారులను తోసి అవతల పడేస్తున్నారు. అర్హతలు లేకపోయినా పైరవీలతో పెద్ద కుర్చీల్లో కూర్చుని, కర్రపెత్తనం చేసే బాసులకు అసలు స్థానాలను చూపెడుతున్నారు. వరద మిగిల్చిన బురదను ప్రజలు ప్రక్షాళన చేసుకుంటుంటే, గతంలో వీర విధేయతే అర్హతగా అందలాలెక్కి ప్రజలకు అందకుండా పోయిన అధికారులతో పరిపాలనావ్యవస్థకు అంటిన బురదను కడిగివేసే పనిలో ముఖ్యమంత్రి రోశయ్య గత రెండు రోజులుగా తలమునకలై ఉన్నారు.
తాత్కాలికంగా అంటూ ముఖ్యమంత్రి బాధ్యతలను స్వీకరించిన రోశయ్య పదవి స్వీకరించిన రోజున 'ఈ పని తనకు శక్తికి మించినద'ని చెప్పారు. కానీ రోజులు గడిచిన కొద్దీ రోశయ్య రాటుదేలారు. ఇప్పుడు కత్తులు దూస్తున్నారు. తల తిరుగుడు అధికారులను, తల పొగరు సహచరులను దారికి తెచ్చుకోడానికి ఒక్కొక్క అస్త్రాన్నీ ప్రయోగిస్తున్నారు. అనేక మంది ముఖ్యమంత్రుల పనితీరును చాలా సన్నిహితంగా గమనించి రాటుదేలిన ఈ అనుభవశాలి అయిన వృద్ధ నేత ముందు పప్పులు ఉడకవనే వాస్తవాన్ని నిదానంగా అర్ధమయ్యే రీతిలో వ్యవహరిస్తున్నారు. పల్లెత్తు మాట అనకుండానే ఒక్కొక్కరికీ ముకుతాళ్ళు బిగిస్తున్నారు.
వాస్తవానికి గడచిన నెల రోజుల్లో రాష్ట్రం ఊహించని విపత్తులను ఎదుర్కొంది. సెప్టెంబర్ రెండో తేదీ హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్ దుర్మరణం పాలుకావడం, ఆ షాక్ లో వందలాది మంది మృతి చెందడం, రాజకీయంగా తీవ్రమైన అయోమయస్థితి ఏర్పడింది. రోశయ్యను వెంటనే ముఖ్యమంత్రిని చేసినా రాష్ట్రంలో పరిపాలన గాడిలో పడలేదు. రోశయ్య కూడా ప్రారంభ దినాల్లో అనాసక్తి ప్రదర్శించారు. ఈ లోగా స్వైన్ ఫ్లూ మహమ్మారి రాష్ట్రంలో ప్రాణాలను తీయడం ప్రారంభించింది. దానిని నిరోధించే కసరత్తులో ఉండగానే వరదలు ముంచెత్తాయి. రాజకీయంగా కల్లోలంగా ఉన్న స్థితిలో వచ్చిన వరదలు ఒక రకంగా రోశయ్యకు మేలు చేశాయని చెప్పక తప్పదు. అప్పటి వరకూ జగన్ నామస్మరణ తప్ప మరో పని చేయని మంత్రులు వరద దెబ్బతో రోశయ్య దారికి రాకతప్పలేదు. మంత్రుల వైఖరిని చూసి కాలం గడిపేస్తున్న అధికారులూ వరద తాకిడితో పరుగులు తీయక తప్పలేదు. గడ్డుకాలంలో కూడా రాజకీయాలను చేస్తే ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని భావించిన వైఎస్ విధేయులు బాణీ మార్చి వరద తాకిడికి గురైన జిల్లాలకు వెళ్ళి రోశయ్య ఆదేశాల ప్రకారం పనిచేయవలసి వచ్చింది.
Pages: 1 -2- News Posted: 8 October, 2009
|