నోబెల్ 'వెంకీ' - సైకిల్ ఓనరు సియాటల్ : యాక్టర్ ను కాకపోతే డాక్టర్ ను కావాలనుకున్నానంటూ మన సినీతారలు గొప్పలు పోవడం మనకు తెలిసిందే. మన వెంకీ కూడా అంతేనండోయ్! వెంకీ అంటే నటుడు వెంకటేష్ కాదు సుమా... రసాయనశాస్త్రంలో నోబెల్ బహుమతిని పొందిన మన ప్రవాస భారతీయ శాస్త్రజ్ఞుడు వెంకట్రామన్ రామకృష్ణన్. తల్లితండ్రులు, స్నేహితులు, సన్నిహితులు వెంకీ అని పిల్చుకునే వెంకట్రామన్ సైన్సు వైపు వెళ్ళడం అతని తల్లితండ్రులకు సుతరాము ఇష్టం లేదట. వెంకీ మంచి వైద్యుడు కావాలని మేం భావించాం. అతనికి అలానే బరోడా మెడికల్ కాలేజీలో సీటు కూడా వచ్చింది. కానీ వెంకీ మాకు చెప్పకుండా బరోడా విశ్వవిద్యాలయానికి వెళ్ళి భౌతిక శాస్త్రం చదవడానకి పేరు నమోదు చేసుకుని వచ్చాడని అతని తండ్రి సివి రామకృష్ణన్ వెల్లడించారు.
వెంకీ తల్లితండ్రులు కూడా శాస్త్రవేత్తలే. కానీ కొడుకు మెడిసిన్ చదివి డాక్టర్ కావాలని ఆశించారు. కానీ వెంకీ భౌతికశాస్త్రంపై ఆసక్తి చూపించేసరికి వారు మళ్ళీ వత్తిడి చేయలేదు. ఆర్ధికంగా బాగుపడతారని, సామాజికంగా గుర్తింపు పొందే డాక్టరో, ఇంజనీరో కావాలనే ఆలోచనతోనే తమ కుమారుడు మెడిసిన్ చదవాలని కోరుకున్నామని సీనియర్ రామకృష్ణన్ చెప్పారు. అప్పట్లో మేం దిగువ మధ్యతరగతి కుటుంబీకులం. మా ఆలోచనలు అందరిలానే ఉండేవని ఆయన వివరించారు.
ఇంత పెద్ద శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి పొందిన వెంకీకి ఇప్పటికీ సొంత కారు లేనేలేదు. ఆయన ఎక్కడకు వెళ్ళాలన్నా సైకిల్ మీదే వెళతారట. రోజు పరిశోధనలు చేసే ఉద్యోగానికి కూడా వెంకీ సైకిల్ నే వినియోగిస్తారని తండ్రి చెప్పారు. అతి నిరాడంబరంగా సాదాసీదాగా జీవించడం అంటే వెంకీకి చాలా ఇష్టం. అతని సోదరి కూడా అంతే. తమకు వచ్చే ఆదాయాన్ని వితరణకే ఖర్చు చేస్తారు. వెంకీ సోదరి లలితా రామకృష్ణన్ సియాటల్ వైద్య విశ్వవిద్యాలయంలో ప్రోఫెసర్ గా పని చేస్తున్నారు. ఆమె వైద్యం చేయడం కంటే పరిశోధనలకే సమయం వెచ్చిస్తున్నారు. వీరిద్దరికీ అతి సామాన్యమైన జీవనం గడపటమే ఇష్టమని తండ్రి వివరించారు.
Pages: 1 -2- News Posted: 8 October, 2009
|