ఎండిపోతున్నసుంకేశుల కర్నూలు : సర్వస్వాన్నీ గంగమ్మతల్లి తుడిచిపెట్టిపోయింది. కానీ రాయలసీమ వాసులకు ముఖ్యంగా కడప, కర్నూలు జిల్లా ప్రజలకు అసలు ముప్పు ముంచుకువస్తోంది. సాగుకు నీరు లేక పంట పొలాలు బీడులయ్యే ప్రమాదం ... తాగడానికి గుక్కెడు నీరు దొరక్క బతుకు దుర్భరమయ్యే ఆపద... తరుముకు వస్తున్నాయి. ఎందుకంటే రాయలసీమ వరప్రదాయని సుంకేసుల రిజర్వాయర్ చుక్కనీరు లేకుండా ఎండిపోనుంది. తుంగభద్రమ్మ తెస్తున్న నీరు ఒక్క చుక్క కూడా బ్యారేజ్ లో ఆగకుండా కిందకుపోతోంది.
వారం రోజుల క్రితం ముంచెత్తిన వరద తాకిడికి సుంకేశుల బ్యారేజ్ దారుణంగా దెబ్బతింది. ప్రధాన సిమెంట్ కట్టడం యధాతథంగా ఉన్నప్పటికీ దాని క్రెస్ట్ గేట్లు పనికిరాకుండా పోయాయి. బ్యారేజ్ సిమెంట్ కట్టడానికి రెండువైపులా ఉన్న మట్టికట్టలు కిలోమీటరు పొడవునా కొట్టకుపోయాయి. ప్రస్తుతం బ్యారేజ్ లోకి ప్రతీ రోజూ అరవై, డబ్బై వేల క్యూసెక్కుల నీరు వస్తోంది. కానీ వస్తున్న నీరు వస్తున్నట్టే దిగువకు పోతోంది. నీటి ప్రవాహాన్ని ఆపడానికి కనీసం గేట్లు మూసివేద్దామన్నా విద్యుత్ లేకపోవడంతో కుదరడం లేదు. దాంతో అధికారులు నిస్సహాయంగా, ఏంచేయాలో దిక్కుతోచక కళ్ళప్పగించి చూస్తున్నారు.
సుంకేశుల ప్రాజెక్టులో 5.24 టిఎంసీల నీటిని నిల్వచేసుకోవచ్చు. కాని ప్రస్తుతం ఒక టిఎంసి నీరు మాత్రమే ఉంది. బ్యారేజ్ మరమ్మతు చేయడానికి కనీసం యాభై కోట్ల రూపాయల సొమ్ము, రెండు నెలల కాలం కావాలని అధికారులు చెబుతున్నారు. అయినా రెండు జిల్లాల ప్రజలకు తాగడానికి, సాగుకు నీరు కరువు వచ్చి పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టుగా నిర్మించిన దీనికి మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కరరెడ్డి పేరు పెట్టారు. ప్రాజెక్టు కుడి పక్కన కర్నూలు జిల్లా సుంకేశుల గ్రామం, ఎడమ పక్కన మహబూబ్ నగర్ జిల్లా రాజోలి గ్రామం ఉంటాయి. దాంతో సుంకేశుల ప్రాజెక్టుగానే వ్యవహారంలోకి వచ్చింది.
Pages: 1 -2- News Posted: 9 October, 2009
|