మావోలపై 'గగన' యుద్ధం న్యూఢిల్లీ : పోలీసుల్ని హతమారుస్తూ పెట్రేగిపోతున్న మావోయిస్టులను ఉక్కుపాదంతో నలిపేయడానికే కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. రాష్ట్రపోలీసులకు తోడుగా కేంద్ర బలగాలను మావో ప్రభావిత రాష్ట్రాల్లో మోహరించాలని, వీరికి అండదండలు ఇవ్వడానకి వైమానిక దళాన్ని సైతం ప్రయోగించాలని నిర్ణయించింది. భారత వైమానిక దళం రంగంలోకి దిగినా ఎదో రాంబో తరహా వీరోచిత యోధుని గెరిల్లా యుద్ధ దృశ్యాలు ఉండబోవని వైమానిక దళం ప్రధానాధికారి ఎయిర్ ఛీఫ్ మార్షల్ ప్రదీప్ వసంత్ నాయక్ స్పష్టం చేశారు.
మావోయిస్టు ఏరివేత కార్యక్రమంలో ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపేందుకు అనుమతి ఇవ్వాలని వైమానిక దళం భారత రక్షణ శాఖను ప్రత్యేకంగా కోరింది. ఈ ప్రతిపాదన ఇంకా పరిశీలనలోనే ఉందని రక్షణ మంత్రి ఎకె ఆంటోనీ చెప్పారు. 77 వ ఎయిర్ ఫోర్సు దినోత్సవం సందర్భంగా వసంత్ నాయక్ మాట్లాడుతూ మావోయిస్టు ఆపరేషన్ లో పాల్గొనడానికి ఎంఐ 17, ఎంఐ 171వి హెలికాప్టర్ లను, భారత వైమానిక దళం నుంచి ఎంపిక చేసిన సుశిక్షితులైన కమెండోలను వినియోగించనున్నామని వివరించారు. ఈ హెలికాప్టర్లకు లైట్, మీడయం మెషిన్ గన్లు అమర్చి ఉంటాయి. ఈ హెలికాప్టర్లలో 'గరుడ' కమెండోలు ఉంటారు.
కాశ్మీరు వైమానిక స్థావరంపై ఉగ్రవాదులు దాడి చేసిన అనంతరం భారత వైమానిక దళం 'గరుడ' కమెండో దళాన్ని రూపొందించింది. యువకులతో కూడిన ఈ ప్రత్యేక దళం వైమానిక సిబ్బందిని, వైమానిక దళం ఆస్తులను రక్షించే బాధ్యతలను నిర్వర్తిస్తుంది. మెషిన్ గన్లు అమర్చిన హెలికాప్టర్లలో గరుడ కమెండోలు ఉంటారంటే అదేదో సిల్వెస్టర్ స్టాలిన్ నటించిన రాంబో సినిమా సాహసకృత్యాలు ఉంటాయని కాదని వసంత్ నాయక్ స్పష్టం చేశారు. సాయుధ సైన్యాన్ని దేశ అంతర్గత భద్రతా వ్యవహారాలుకు వినియోగించడానికి తాము పూర్తిగా వ్యతిరేకమని నాయక్ చెప్పారు. దానికి చాలా నియమనిబంధనలు ఉన్నాయన్నారు. కాగా ఇప్పటికే జమ్ము-కాశ్మీరు, ఈశాన్య రాష్ట్రాల్లో సైన్యం సేవలు వినియోగించుకుంటున్నామని, వీటి విస్తృతిని పెంచే ఆలోచన లేదని రక్షణ మంత్రి ఆంటోని చెబుతున్నారు.
Pages: 1 -2- News Posted: 9 October, 2009
|