రొంపిలోకి రోశయ్య? హైదరాబాద్ : అందరికీ ఆమోదయోగ్యుడని, వివాదరహితుడని, వర్గాలు, కోటరీలకు దూరమని, శాసనసభ్యులంతా గౌరవించే వ్యక్తని రోశయ్యకు మంచిపేరు ఉంది. కానీ ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన తరువాత ఆయన చుట్టూ కూడా కాంగ్రెస్ మార్కు రాజకీయాలు మొదలైపోయాయి. ఆయనకూ ప్రత్యేక వర్గం పుట్టుకొచ్చేసింది. కోటరీ సిద్ధమైపోయింది. వంది మాగధులు, భట్రాజు దళాలు కొలువు తీరినట్టే కనిపిస్తున్నాయి. అధికారం కోసం జరుగుతున్న పెనుగులాటలో జగన్ వర్గం అనే వైఎస్ వీర విధేయవర్గం ఒక్కటే కనిపించేది. ఇప్పుడు రోశయ్య వర్గం బయలుదేరడమే అసలు సిసలైన పరిణామం. ఇంతకాలం పరిశుభ్ర రాజకీయ నేతగా ఉన్న రోశయ్య సైతం తనకు తెలియకుండానే రొంపిలోకి జారిపోతున్నారని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.
ముఖ్యమంత్రిగా రోశయ్యను ఆమోదించడం ఎందుకంటే జగన్ కు ఆ పదవి దక్కకుండా చేయడానికేననే వ్యూహాన్ని అనుసరిస్తున్న వారంతా కొత్తగా రోశయ్య వర్గం మాస్కు వేసుకున్నారు. దీనిలో సీనియర్లు, పార్టీని నడిపిస్తున్న నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఉండటం గమనార్హం. రాష్ట్రంలో మీడియా కూడా రోశయ్య వర్గానికి విపరీతమైన ప్రచారం ఇస్తోంది. జగన్ విధేయులు ఏం చేసినా దానిని అధిష్టానానికి వ్యతిరేక కార్యక్రమంగా చిత్రీకరణ జరుగుతోంది. జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలని కోరడమే మహాపాపమని, వారంతా అధిష్టానాన్ని ధిక్కరిస్తున్నారని, అసలు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ముక్కలు చేయడానికే ప్రయత్నిస్తున్నారన్న అభిప్రాయం కలిగే కథనాలు ఎక్కువయ్యాయి. రోశయ్యను సమర్ధించడమే కాంగ్రెస్ పార్టీకి అసలైన విధేయత అనే భావం కలిగించడానికి కృషి జరుగుతోంది.
ఈ ప్రయత్నాల నేపథ్యంలో వైఎస్ వర్గానికి వ్యతిరేకంగా ఉన్న కాంగ్రెస్ నాయకులు వరసగా గొంతెత్తుతున్నారు. అటు అధిష్టానంలో, ముఖ్యమంత్రి దృష్టిలో, ఇటు మీడియా కంటిలో పడటానికి తాపత్రయపడుతున్నారు. తాజాగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి శంకర్‌రావు శుక్రవారం సిఎల్‌పిలోమీడియా సమావేశం ఏర్పాటు చేసి తామంతా కేవలం వైఎస్ వల్లే గెలవలేదని, సోనియాగాంధీ, మన్మోహన్‌సింగ్ అభివృద్ధి కార్యక్రమాల వల్లే గెలిచామంటూ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో సంచలనం సృష్టించాయి. వైఎస్ వల్ల గెలిచింది కేవలం 10 శాతమేనంటూ ఆయన చేసిన వ్యాఖ్య వైఎస్ వర్గాన్ని ఇరుకునపెట్టింది. తమ నేత కె.రోశయ్యేనని ఆయన వ్యాఖ్యానించారు. సిఎం ఎంపికలోనైనా ఏ విషయంలోనైనా పార్టీ అధిష్టానం నిర్ణయమే సుప్రీం అని వ్యాఖ్యానించారు.
Pages: 1 -2- News Posted: 9 October, 2009
|