రాణి ముందు బాలీవుడ్ నృత్యం లండన్ : ఇంగ్లండ్ రాణి మంగళవారం రాత్రి బకింగ్ హామ్ ప్యాలెస్ లో బాలీవుడ్ నృత్యాలను తిలకించనున్నారు. భారత రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ఈ నెల 27 నుంచి 29 వరకు యునైటెడ్ కింగ్ డమ్ (యుకె)లో జరపనున్న అధికార పర్యటనకు ముందుగా బ్రిటిష్ భారతీయ సమాజం సభ్యులు 300 మందికి రాణి, ఎడింబరో ప్రభువు ఒక రిసెప్షన్ నిర్వహించినప్పుడు ఆమె ఈ వృత్యాలను తిలకిస్తారు.
'రాణి ఇంతకుముందు బ్రాడ్ ఫర్డ్ ను సందర్శించిన సమయంలో బాలీవుడ్ నృత్యాలను తిలకించారు. కాని, బకింగ్ హామ్ ప్యాలెస్ లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం మాత్రం ఇదే ప్రథమం' అని రాణి అధికార ప్రతినిధి ఒకరు తెలియజేశారు.
1911 నాటి ఢిల్లీ దర్బార్ కోసం ఒకసారి ఉపయోగించిన ఎరుపు, బంగారు రంగు పందిరి నీడలో బ్రిటిష్ - ఆసియా నృత్య బృందం 'నట్ ఖత్' సోమవారం రిహార్సల్స్ చేసింది. ఈ సంస్థకు చెందిన కళాత్మక సహ దర్శకులు అజయ్ చాబ్రా, సిమ్మీ గుప్తా కొరియోగ్రఫీ ప్రాముఖ్యాన్ని అక్కడ సమీకృతమైన బ్రిటిష్ మీడియా సభ్యులకు విశదం చేశారు. 'శ్రీ 420' చిత్రంలోని 'ప్యార్ హువా ఇక్రార్ హువా', 'ఝూమ్ బరాబర్ ఝూమ్' చిత్రంలోని టైటిల్ గీతం, 'బంటీ ఔర్ బబ్లీ' చిత్రంలోని 'ధడక్ ధడక్' తో సహా తన ఫేవరైట్ హిందీ చిత్రాలలోని నృత్య సన్నివేశాలతో ఒక కార్యక్రమాన్ని తాను రూపొందించినట్లు సిమ్మీ తెలియజేశారు. '1940 దశకంలోని బ్లాక్ అండే వైట్ చిత్రాలతో పాటు ఈనాటి వర్ణ చిత్రాలలోని' పాటలకు అడుగులు వేయనున్నట్లు సిమ్మీ తెలిపారు.
బకింగ్ హామ్ ప్యాలెస్ నుంచి సీనియర్ అధికారి ఒకరు అజయ్ కు టెలిఫోన్ చేసి రాణి బాలీవుడ్ నృత్యాలు కొన్నిటిని చూడాలని అభిలషిస్తున్నట్లుగా చెప్పినప్పుడు ఆయన ముందు దానిని ఒక జోకుగా భావించారు. కాని 'ఇది గొప్ప గౌరవం, ఒక సవాల్ కూడా' అని గుప్తా పేర్కొన్నారు.
Pages: 1 -2- News Posted: 13 October, 2009
|