కాంగ్రెస్ ధీమాగా ఉన్నా... న్యూఢిల్లీ : మంగళవారం (13న) ఎన్నికలు జరిగిన మూడు రాష్ట్రాలలో అధికారాన్ని నిలబెట్టుకోవడం ద్వారా భారతీయ జనతా పార్టీ (బిజెపి)ని తిరుగులేని దెబ్బ తీయాలని కాంగ్రెస్ అధిష్ఠాన వర్గం ఆశిస్తున్నది. కాని మహారాష్ట్రే వారికి తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది. అసెంబ్లీ సీట్లలో సగానికి సగం అంటే 144 సీట్లు దక్కడం కష్టం కావచ్చుననే అభిప్రాయం కాంగ్రెస్ సీనియర్ నాయకులకు కలిగినట్లు తెలుస్తున్నది. దీనితో తిరుగుబాటు అభ్యర్థులను,ఇండిపెండెంట్లను, తృతీయ ఫ్రంట్ లో గెలిచే అవకాశం ఉన్న అభ్యర్థులను కాంగ్రెస్ వైపు ఆకర్షించడానికి అప్పుడే ప్రయత్నాలు ప్రారంభించారు.
కాంగ్రెస్ - ఎన్ సిపి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగల స్థితిలో ఉండగలదని, సానుకూల గవర్నర్ ఉండడం వల్ల సాధారణ మెజారిటీని ఏదో విధంగా సంపాదించేట్లు చూడవచ్చునని మెజారిటీ సభ్యులు అభిప్రాయపడుతున్నారు.
మహారాష్ట్ర వంటి పెద్ద రాష్ట్రంలో ప్రతిపక్షానికి విజయం లభిస్తే అది ఇప్పటికే సంక్షుభిత పరిస్థితులు ఎదుర్కొంటున్న బిజెపికి ఉత్తేజాన్ని ఇవ్వవచ్చు కనుక కావలసిన సంఖ్యాధిక్యాన్ని ఏదో విధంగా సాధించడానికి కాంగ్రెస్ శక్తివంచన లేకుండా ప్రయత్నించవచ్చునని అనుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ తదుపరి పోరు ఝార్ఖండ్ లో సాగించవలసి ఉంటుంది. ఆ రాష్ట్రంలో బిజెపి బలిష్టంగా ఉంది.
పది సంవత్సరాల ప్రభుత్వ వ్యతిరేకత అనంతరం మహారాష్ట్రలో పోటీ గడ్డుగా ఉందని కాంగ్రెస్ నాయకుడు ఒకరు అంగీకరించారు. అయితే, 'మాకు ఇప్పటికీ ఆశగానే ఉన్నది. ఎందుకంటే శివసేన- బిజెపి కూటమి ఎన్నడూ పుంజుకోలేదు. థాకరే సోదరులిద్దరి మధ్య హీనంగా సాగుతున్న పోరు వారి మద్దతుదారులకు కూడా ఆగ్రహం కలిగిస్తున్నది' అని ఆయన పేర్కొన్నారు.
Pages: 1 -2- News Posted: 13 October, 2009
|