యుపిఎకే 'మహా', హర్యానా! న్యూఢిల్లీ : మంగళవారం మూడు రాష్ట్రాల శాసనసభలకు జరిగిన ఎన్నికలలో అనూహ్యంగా మహారాష్ట్రలో 60 శాతం, హర్యానాలో 68 శాతం, అరుణాచల్ ప్రదేశ్ లో 72 శాతం పోలింగ్ నమోదు కావడం దేనికి సూచనో రాజకీయ పండితులకు అంతుపట్టడం లేదు. కాని ఎగ్జిట్ పోల్స్ నిర్వాహకులు మాత్రం ఐక్య ప్రగతిశీల కూటమి (యుపిఎ) చివరకు విజేత కాగలదని జోస్యం చెబుతున్నారు.
మహారాష్ట్రలో మూడు ఎగ్జిట్ పోల్స్ ప్రకారం హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశం ఉన్నప్పటికీ శివసేన - భారతీయ జనతా పార్టీ (బిజెపి) సంకీర్ణం కన్నా కాంగ్రెస్ - నేషనల్ కాంగ్రెస్ పార్టీ (ఎన్ సిపి) కూటమికే ఎక్కువగా సీట్లు లభించే సూచనలు కనిపిస్తున్నాయి. అంటే రాష్ట్రంలో తదుపరి ప్రభుత్వాన్ని యుపిఎ ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయన్న మాట. హర్యానాలో కాంగ్రెస్ పార్టీకే మూడింట రెండు వంతుల మెజారిటీ లభిస్తుందని ఎగ్జిట్ పోల్స్ నిర్వాహకులు అందరూ సూచించారు. అయితే, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఎవ్వరూ ఎగ్జిట్ పోల్స్ నిర్వహించలేదు.
288 స్థానాలు ఉన్న మహారాష్ట్ర శాసనసభలో యుపిఎ 135 నుంచి 145 వరకు స్థానాలు గెలుచుకోగలదని సిఎన్ఎన్-ఐబిఎన్ పోల్ సూచించింది. 2004 ఎన్నికలలో యుపిఎ గెలుచుకున్న సీట్లకు (140కి) ఇది దాదాపు సమానం. అయితే, కాంగ్రెస్ పార్టీకి 75 నుంచి 85 వరకు, ఎన్ సిపికి 55 నుంచి 65 వరకు సీట్లు రావచ్చునని అంచనా. అంటే ఈ సంకీర్ణంలో మొగ్గు మారుతోందన్నమాట. ఇదే చానెల్ నిర్వహించిన పోల్ ప్రకారం సేన-బిజెపి కూటమికి 105 నుంచి 115 వరకు సీట్లు లభించవచ్చు. సేనకు 55, 65 మధ్య, బిజెపికి 45, 55 మధ్య సీట్లు రావచ్చు. రాజ్ థాకరే సారథ్యంలోని ఎంఎన్ఎస్ పార్టీ 8 నుంచి 12 వరకు సీట్లు గెలుచుకోగలదని ఈ పోల్ సూచిస్తున్నది. అంటే ఈ పార్టీ ఎన్ డిఎ అవకాశాలకు నష్టం కలిగిస్తున్నదన్నమాట. ఈ పోల్ ప్రకారమే, ఇతరులకు 25, 35 మధ్య సీట్లు రావచ్చు.
స్టార్ న్యూస్ నిర్వహించిన పోల్ ప్రకారం సంకీర్ణాల వరకు ఇదే స్థాయిలో ఫలితాలు రావచ్చు. కాని యుపిఎలో కాంగ్రెస్ పార్టీకే ఎక్కువ మొగ్గు ఉన్నది. కాంగ్రెస్ కు 89, ఎన్ సిపికి 48, బిజెపికి 51, సేనకు 62 సీట్లు రావచ్చునని ఈ పోల్ సూచిస్తున్నది. ఎంఎన్ఎస్ కు 12, ఇతరులకు 26 సీట్లు రాగలవని ఇది సూచిస్తున్నది.
Pages: 1 -2- News Posted: 14 October, 2009
|