ఇక్కడ దీపావళి పక్షులకే! శివగంగ : శనివారం రాత్రి దేశమంతటా టపాసులు, తారాజువ్వలతో మెరుపులు మెరుస్తుంటాయి. ఆ బాణసంచాలో అత్యధిక భాగం తమిళనాడులోని శివకాశి నుంచి సరఫరా అయి ఉంటాయి. కాని శివకాశికి రమారమి 90 కిలో మీటర్ల దూరంలో శివగంగను ఆనుకుని ఉన్న ఒక చిన్న ప్రాంతంలో మాత్రం దీపావళి రోజు ఆకాశంలో చీకటి, నిశ్శబ్దం ఆవరించుకుని ఉండేలా జాగ్రత్త పడుతున్నారు. ఇప్పటికి మూడు దశాబ్దాలుగా సింగంపునారిలో ఒక బాణసంచా కూడా కాల్చలేదు. వెడంకుడి పక్షుల అభయారణ్యంలో గూళ్ళు కట్టుకునే రకరకాల రమణీయమైన వలస పక్షులను వీటితో బెదరగొట్టుతుందనే భయమే ఇందుకు కారణం. రష్యాలోని సైబీరియా నుంచి, యూరప్ నుంచి వలస వచ్చే పక్షులు ఈ ప్రాంతంలో గూళ్ళు కట్టుకుంటుంటాయి.
గ్రే హెరాన్స్, డార్టర్స్, స్పూన్ బిల్స్, వైట్ ఇబిసెస్, ఏషియన్ ఓపెన్ బిల్ స్టార్క్ లు, చివరకు లిటిల్ కార్మాంట్, లిటిల్ ఎగ్రెట్, కాటిల్ ఎగ్రెట్, ఫ్లెమంగోలు వంటి అంతరించిపోయే జాతుల పక్షులు కూడా అక్టోబర్, మార్చి నెలల మధ్య సైబీరియా, హంగరీ, న్యూజిలాండ్ వంటి సుదూర ప్రాంతాల నుంచి, మన దేశంలోని ఉత్తరాది రాష్ట్రాల నుంచి ఇక్కడికి వలస వస్తుంటాయని శివగంగ జిల్లా అటవీ శాఖ అధికారి (డిఎఫ్ఒ) సంపత్ లాల్ గుప్తా తెలియజేశారు.
మదురై - తిరుపత్తూరు రోడ్డు సమీపంలో చిన్న డ్రెయినేజి బేసిన్లలో 40 ఎకరాల విస్తీర్ణంలో గల వెట్టంకుడి పక్షుల శాంక్చువరీకి బాగా దగ్గరగా ఉన్న గ్రామాలే కొల్లుకుడిపట్టి, వెడంకుడిపట్టి.
బాణసంచా కాల్చకూడదన్న అలిఖిత నియమానికి ఈ రెండు గ్రామాలలోని 500 కుటుంబాలు నిబద్ధమై ఉన్నట్లు కొల్లుకుడిపట్టికి చెందిన వి. సెల్వరాజ్ తెలియజేశారు. పక్షి ప్రేమికుడైన సెల్వరాజ్ సదా ఆ అభయారణ్యాన్ని సందర్శిస్తూంటారు. అలా పక్షులను గమనిస్తుంటే కలిగే ఆనందం ఇంతా అంతా కాదని, వాటి పరిరక్షణ ఆవశ్యకత గురించి జనంలో చైతన్యం కలిగించేందుకు తాను కృషి చేస్తున్నానని ఆయన తెలిపారు. టపాసులు పేల్చరాదన్న తమ గ్రామం ప్రతిజ్ఞ గురించి సెల్వరాజ్ వివరిస్తూ, స్వాతంత్ర్యానికి ముందు కాలంలో తన తండ్రి, ఇతర గ్రామస్థులు అరుదైన పక్షులను వేటాడేవారని, వాటి మాంసం ఎంతో రుచిగా ఉంటుందని భావించేవారని చెప్పారు. 'కాని నా మిత్రులు, నేను వాటిని కాపాడేందుకు ఎప్పుడూ ప్రయత్నిస్తుండేవారం' అని సెల్వరాజ్ చెప్పారు.
Pages: 1 -2- News Posted: 15 October, 2009
|