క్లైమేట్ మార్పుతో అనర్థమే న్యూఢిల్లీ : వాతావరణ మార్పుల వల్ల నష్టం మన దేశానికీ తప్పలేదని బుధవారం ఢిల్లీలో విడుదల చేసిన 14 సెట్ల పరిశోధన అధ్యయన పత్రాలు స్పష్టం చేస్తున్నాయి. కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి జైరామ్ రమేష్ ఈ అధ్యయన పత్రాలను విడుదల చేస్తూ, ఇప్పుడు 230 మిలియన్ టన్నుల మేరకు ఉన్న ఆహార ధాన్యాల ఉత్పత్తి ఈ శతాబ్దాంతానికి 20 శాతం నుంచి 40 శాతం మేరకు పడిపోవచ్చునని సూచించారు.
అంతేకాకుండా తుపానుల తీవ్రత పెరుగుతుంది. హిమనదాలు మరింత వేగంగా కరిగిపోతుంటాయి. అకస్మాత్తుగా వర్షాలు పడడం ఇక మామూలు వ్యవహారమై పోతుంది.
ఉష్ణోగ్రతలో ఒక డిగ్రీ సెల్షియస్ పెరుగుదల వల్ల గోధుమలు, సోయాబీన్, ఆవాలు, వేరుశనగ, బంగాళాదుంపల పంటల దిగుబడి మూడు శాతం నుంచి ఏడు శాతం వరకు పడిపోతుందని వ్యవసాయ పరిశోధనా సంస్థ భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసిఎఆర్) అధ్యయనం సూచిస్తోంది.
'ఉష్ణోగ్రత కనుక ఇంకా ఒక డిగ్రీ ఎక్కువగా ఉన్నట్లయితే, ఈ నష్టం మరింత అధికంగా ఉంటుంది' అని ఐసిఎఆర్ లో పర్యావరణ సైన్స్ విభాగం అధిపతి పి.కె. అగర్వాల్ సూచించారు. వేడిని తట్టుకోగల పంట రకాలను సాగు చేయడం ద్వారా సాధ్యమైనంత త్వరలో ఈ పర్యావరణ మార్పునకు ఎలా అలవాటు పడవచ్చునో రైతులకు ప్రభుత్వం సుబోధకం చేయాలని అగర్వాల్ కోరారు. 'ఏదైనా పంట రకాన్ని అభివృద్ధి చేయడానికి పది నుంచి ఇరవై సంవత్సరాల వరకు వ్యవధి పడుతుంది. మనం ఇప్పుడే ఉద్యుక్తులం కావడం అవసరం ' అని ఆయన అన్నారు.
Pages: 1 -2- News Posted: 15 October, 2009
|