వైఎస్ పథకాలే శ్రీరామరక్ష హైదరాబాద్ : ఎంత కష్టమైనా రాష్ట్రంలో వైఎస్ పథకాలన్నీ ఖచ్చితంగా అమలుచేసి తీరాలని మంత్రులు కోరారు. ముఖ్యంగా రెండవసారి ఎన్నికల వాగ్దానాలైన కిలో రెండు రూపాయల అదనపు బియ్యం, రైతులకు 9 గంటల పాటు ఉచిత విద్యుత్ పథకాలు కొనసాగి తీరాలని వారు పట్టుపట్టారు. అప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతుందని మంత్రులందరూ ముఖ్యమంత్రి రోశయ్యకు స్పష్టం చేసినట్లు తెలిసింది. వరదల తరువాత గురువారం జరిగిన మొదటి కేబినెట్ సమావేశానికి మంత్రులందరూ హాజరయ్యారు. ప్రస్తుతం పార్టీలో ఉన్న గ్రూపు కలహాల దృష్ట్యా గ్రేటర్ ఎన్నికలు వాయిదా వేయడమే ఉత్తమమన్నఅభిప్రాయం వెల్లడయింది.
వరద ప్రాంతాల్లో బాధితులకు మరింత ఉదారంగా సాయం అందించాల్సిన అవసరముందన్న నిర్ణయానికి వచ్చారు. గడచిన వందేళ్లలో చూడని వరద ఉధృతి ఈ ఏడాది రావడం తో సాగునీటి పారుదల ప్రాజెక్టులు ఎంతవరకు సురక్షితం? ఇప్పటి అంచనాలు సరిపోతాయా? లేదా ప్రాజెక్టుల అంచ నాలపై పునరాలోచన చేయాలా? అన్న అంశాలు చర్చకు వచ్చాయి. అయితే ఇప్పటికే కొన్ని ప్రాజెక్టుల వ్యయం, ఇతర అంచనాలు భారీగా పెరిగినందున నీటి పారుదల శాఖ అన్ని నిబంధనలు దృష్టిలో ఉంచుకుని భవిష్యత్ అవసరాలకు తగినట్లు సురక్షిత ప్రాజెక్టుల అంచనాలు సిద్ధం చేయాలని సూచించినట్లు తెలుస్తోంది. పిసిసి అధ్యక్షుడు డిఎస్ వర్గం, రంగారెడ్డి జిల్లాల్లో కొన్ని చోట్ల దానం వర్గం అంటూ కాంగ్రెస్‌లో అంతర్గత పోరు, విభజనలు, వైరి వర్గాలలో నేపథ్యంలో గ్రేటర్ ఎన్నికల్లో గట్టెక్కలేమన్న భావన వ్యక్తమయినట్లు సమాచారం.
Pages: 1 -2- News Posted: 15 October, 2009
|