దీదీ వెంట దాదా! కోలకతా : బెంగాల్ దీదీ గురువారం రాజకీయ గుగ్లీ వేసి బెంగాల్ దాదాను తన వేదికకు సన్నిహితమయ్యేట్లు చూశారు. సిపిఐ (ఎం) నాయకత్వానికి ఫేవరైట్ అని భావించిన, లోక్ సభ ఎన్నికలలో తృణమూల్ కాంగ్రెస్ (టిసి) అధినేత్రి మమతా బెనర్జీపై పోటీకి సిపిఎం సంప్రదించినట్లుగా వదంతులు వ్యాపించిన భారత క్రికెట్ జట్టు మాజీ సారథి సౌరవ్ గంగూలీ గురువారం ఆమెతో కలసి ఒకే వేదికపై ఆశీనుడయ్యాడు.
కోలకతా దక్షిణ శివారులోని బేహళాలో ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్, స్టేడియంకు శంకుస్థాపన సందర్భంగా ఈ కార్యక్రమం జరిగింది. రూ. 57 కోట్లు ఖర్చు కాగల ఈ ప్రాజెక్టును చేపట్టినందుకు రైల్వే మంత్రికి గంగూలీ ధన్యవాదాలు తెలియజేశాడు. ముఖంలో ఆనందాన్ని దాచుకోలేకపోయిన 54 సంవత్సరాల తృణమూల్ అధినేత్రి కొంత సేపు బెంగాల్ క్రికెట్ సింహం పక్కనే కూర్చుని ముచ్చటించారు కూడా. గంగూలీ నివసిస్తున్నది, క్రికెటర్ గా వృద్ధిలోకి వచ్చింది బేహళా ప్రాంతం కావడం గమనార్హం. ఈ సభలో గంగూలీని సత్కరించారు.
కాగా, గురువారం నాటి ఈ సంఘటన మమతా బెనర్జీకి సంబంధించి రాజకీయ ప్రాధాన్యం ఉన్నది. తన రాజకీయ శత్రువు కమ్యూనిస్ట్ పార్టీకి సన్నిహితునిగా గతంలో భావించిన, భారత క్రికెట్ ప్రముఖులలో ఒకరిని ఆమె 'హైజాక్' చేయగలిగారు.
Pages: 1 -2- News Posted: 16 October, 2009
|