జగన్ కు సెంటర్ ఆఫర్! హైదరాబాద్: ముఖ్యమంత్రి పదవి కోసం నిరీక్షిస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కేంద్రంలో సహాయ మంత్రి పదవితో సరిపెట్టాలని పార్టీ అధిష్టానం నిర్ణయించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. జగన్ ను ఢిల్లీకి పరిమితం చేయడం ద్వారా రాష్ట్రంలో రోశయ్యను పూర్తికాలం ముఖ్యమంత్రి పదవిలో కొనసాగించాలని అధిష్టానం భావిస్తోంది. జగన్ ను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోవడం ద్వారా ఆయను ముఖ్యమంత్రిని చేసి తీరాలన్న ఆయన వర్గం డిమాండ్ ను అధిష్టానం సున్నితంగా తిరస్కరించినట్లవుతుంది. రోశయ్య కొనసాగింపునకు వీలుగా పార్టీ ఒక రాజీ సూత్రాన్ని రూపొందించినట్లు తెలియవచ్చింది.
దీనికి అనుగుణంగానే ఈ నెల 23న ఢిల్లీకి రావలసిందిగా సోమవారం పార్టీ హైకమాండ్ నుంచి జగన్ కు పిలుపు వచ్చింది. ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నాయకులైన ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ, సోనియా రాజకీయ సలహాదారు అహమ్మద్ పటేల్ తదితరులతో కూడిన కమిటీతో జగన్ ముందుగా భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ భేటీలోనే జగన్ కు ఇవ్వజూపుతున్న కేంద్ర సహాయ మంత్రి పదవి విషయం ప్రస్తావించి ఈ పదవిని స్వీకరించేలా నాయుకులు జగన్ కు నచ్చచెబుతారని తెలుస్తోంది. కేంద్ర సహాయ మంత్రి పదవికి జగన్ అంగీకరిస్తే పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు కొద్దిగా ముందుగా కేంద్ర మంత్రివర్గాన్ని విస్తరించి జగన్‌కు స్థానం కల్పించవచ్చునని ఎఐసిసి వర్గాలు పేర్కొంటున్నాయి.
Pages: 1 -2- News Posted: 19 October, 2009
|