ఐఐటి కటాఫ్ 80%! న్యూఢిల్లీ : ఐఐటి ప్రవేశ పరీక్షకు అర్హులు కావాలంటే విద్యార్థులు ఇక మీదట తమ 12వ తరగతి బోర్డు పరీక్షలలో అధిక మార్కులు సాధించవలసిన అవసరం రావచ్చు. పాఠశాల చదువు చివరి పరీక్షలను విద్యార్థులు అలక్ష్యం చేయకుండా చూసేందుకు ప్రభుత్వం ఈ పథకం రూపొందిస్తున్నది. విద్యార్థులు ఐఐటి ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఐఐటి జెఇఇ)లో ఉత్తీర్ణులైనప్పటికీ ఐఐటిలో ప్రవేశం పొందడానికి తమ 12వ తరగతి బోర్డు పరీక్షలో వారు కనీసం 60 శాతం మార్కులు సాధించవలసిన అవసరం ఇకమీదట ఉంటుంది.సాధారణంగా ఐఐటి జెఇఇ పరీక్ష ఫలితాలను బోర్డు పరీక్ష ఫలితాల కన్నా ముందుగానే ప్రకటిస్తుంటారు.
టెక్ స్కూల్స్ అత్యున్నత నిర్ణాయక సంస్థ అయిన ఐఐటి కౌన్సిల్ 12వ తరగతి అర్హత స్కోరును పెంచడానికి సోమవారం అంగీకరించింది. 'ఐఐటి ప్రవేశ పరీక్ష కోసం కోచింగ్ క్లాసుల పేరిట ఇబ్బడి ముబ్బడిగా ఏర్పాటవుతున్న టీచింగ్ షాపులను నియంత్రించాలని మా ఆకాంక్ష. విద్యార్థులు తమ బోర్డు పరీక్షలను నిర్లక్ష్యం చేయరాదు' అని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి (హెచ్ఆర్ డి) శాఖ మంత్రి కపిల్ సిబల్ కౌన్సిల్ సమావేశం అనంతరం మీడియాతో చెప్పారు. ఈ కౌన్సిల్ కు సిబల్ అధ్యక్షుడు.
ఈ అర్హత మార్కులు సాధించిన విద్యార్థులకు కూడా ప్రస్తుతం అనుసరిస్తున్న విధానం వలె ఐఐటి జెఇఇలో వచ్చిన మార్కుల ఆధారంగానే అడ్మిషన్ మంజూరవుతుంది. బోర్డు మార్కులకు ప్రాధాన్యం ఇవ్వరు. ఐఐటి మద్రాసు డైరెక్టర్ ఎం.ఎస్. అనంత్ చేసిన ఒక ప్రతిపాదన ప్రాతిపదికగా ఈ అర్హత మార్కులు హెచ్చించాలని నిర్ణయించారు. అనంత్ ప్రతిపాదనను ఈ కౌన్సిల్ ఒక సంవత్సరం పైనుంచి పరిశీలిస్తున్నది. 'ది టెలిగ్రాఫ్' పత్రిక ఇదే విషయాన్ని క్రితం సంవత్సరం ఆగస్టు 25న తెలియజేసింది.
ఐఐటి కౌన్సిల్ సోమవారం నియమించిన ఒక కమిటీ కొత్త ప్రాతిపదిక (కటాఫ్) మార్కులను సిఫార్సు చేస్తుంది. ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బయోలాజికల్ సైన్సుల మధ్య మరింత సమన్వయం సాధించడంపై దృష్టి కేంద్రీకరిస్తూ కొత్త పాఠ్య ప్రణాళికను ఈ కౌన్సిల్ ప్రతిపాదిస్తుంది.
పూర్వపు పరీక్షల సంస్కరణల బృందాలు రెండు చేసిన సిఫార్సులలో చాలావరకు ఇంకా అమలు కాకపోయినప్పటికీ జెఇఇలో సంస్కరణలను కూడా కమిటీ సిఫార్సు చేస్తుందని సిబల్ తెలియజేశారు. 'ఆ ప్యానెల్స్ ను ఏర్పాటు చేసినప్పుడు నేను లేను. గత జల సేతుబంధనం వద్దు' అని మంత్రి అన్నారు. విద్యార్థులు తమ బోర్డు పరీక్షలను అలక్ష్యం చేయకుండా చూసేందుకు ఉద్దేశించిన ఆ ప్యానెల్స్ సిఫార్సుల సంగతి ఏమిటని ప్రశ్నించినప్పుడు సిబల్ ఈ విధంగా సమాధానం ఇచ్చారు.
Pages: 1 -2- News Posted: 20 October, 2009
|