వైఎస్- మేడిన్ చైనా! హైదరాబాద్ : వైఎస్- ఇప్పుడు కాసుల రాశులు కురిపిస్తున్న మహానుభావుడు. భారతదేశంలో ఇంతవరకూ ఏ రాజకీయ నాయకుడికీ లేని, రాని క్రేజ్ స్వర్గీయ వైఎస్ రాజశేఖరరెడ్డికి వచ్చింది. అది వ్యాపారుల పాలిట వరంగా మారింది. కనకవర్షం కురిపిస్తోంది. వైఎస్ పేరే ఆంధ్ర ప్రదేశ్ లో వ్యాపార వస్తువు అయిపోయింది. ప్రజలలో ఆయన పట్ల ఉన్న ఆరాధనను తెలివైన వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్ దుర్మరణం పాలవడం, ఆ తరువాత రాష్ట్ర వ్యాప్తంగా ఆయన పట్ల వెల్లువెత్తిన అభిమానాన్ని గమనించిన ఆంధ్ర వ్యాపారులు వెంటనే తమ కొత్త వ్యాపారాన్ని ప్రారంభించేశారు. వీరికి అండగా నిలచింది మాత్రం చైనాలోని బొమ్మల తయారీ పరిశ్రమలు. ఇక్కడి వ్యాపారులు పంపిన ఫోటోల ఆధారంగా చైనా కంపెనీలు వైఎస్ బొమ్మలను సృష్టించి ఆంధ్రలోకి పంపించాయి. కేవలం రెండు వారాల్లోనే ఈ బొమ్మలు మార్కెట్ ను ముంచెత్తాయి.
ఇంతకు ముందు నాయకుల బొమ్మలున్న కాగితం బరువులు, పెన్ స్టాండ్ లు, కీ చైన్ లు, జేబుకు అలంకరించుకునే బ్యాడ్జ్ లు అందుబాటులో ఉండేవి. మన భారతీయ నాయకులు బొమ్మల కన్నా ఈ తరహా వ్యాపారంలో లెనిన్, మార్క్స, ఎంగెల్స్, మావో బ్యాడ్జీలను వామపక్షాల నేతలు విరివిగా ధరించేవారు. తరువాత చాలా ప్రాచుర్యంలో ఉండే బొమ్మ భగత్ సింగ్ ది. ఆ తరువాత మన జాతీయ జెండా, మహాత్మా గాంధీ బొమ్మలు బ్యాడ్జీలుగా వచ్చాయి. ఎన్నికల సమయంలో కంకీ కొడవలి, బిజేపీ కమలం, కాంగ్రెస్ హస్తం, తెలుగుదేసం సైకిల్ బ్యాడ్జీలు అభిమానులను అలరించాయి. కానీ ఇప్పుడు వాటన్నిటినీ త్రోసిరాజని వైఎస్ బొమ్మ హట్ కేక్ లా అమ్ముడవుతోంది. వెలిగిపోయే నవ్వుతో చేతులు ఊపుతూ ప్రజలకు అభివాదం చేస్తున్నట్టు రూపొందించిన ఈ చైనా బొమ్మకు విపరీతమైన గిరాకీ ఉందని వ్యాపారులు చెబుతున్నారు.
Pages: 1 -2- News Posted: 21 October, 2009
|