అడగరు...వదలరు హైదరాబాద్ : జగన్నాటకం... గత యాభై రోజులుగా ఆంధ్ర రాజకీయాల చిత్ర విచిత్ర పోకడలకు చక్కని శీర్షిక. మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడు జగన్మోహనరెడ్డి కేంద్ర బింధువుగా సాగుతున్న వింత నాటకం. జగన్ నోరు తెరచి తనకు ముఖ్యమంత్రి పదవి కావాలని అడగలేదు. ప్రస్తుత ముఖ్యమంత్ర రోశయ్యా తనకు ఆ పదవి కావాలని అడగలేదు. ఢిల్లీ అధిష్టానం ఇప్పటి వరకూ జగన్ కు ముఖ్యమంత్రి పదవి ఇవ్వనని అనలేదు. రోశయ్యే నాలుగున్నర సంవత్సరాల శాశ్వత ముఖ్యమంత్రి అని ఖండితంగానూ చెప్పలేదు. పదవులు అడగరు... కానీ వాటిని వదలరు. సీనియర్ల మాటల తూటాలు.. జగన్ విధేయల ఆక్రోశపు ప్రకటనలు.. వైఎస్ దుర్మరణంతో, ఆ తరువాత వచ్చిన వరదలతో చింతా క్రాంతులైన ఆంధ్ర ప్రజలకు రసాభాస పోకడలతో కావాల్సినంత వినోదం అందిస్తోంది కాంగ్రెస్ నాటకం.
సరే... విశ్వసనీయ రాజకీయ వర్గాల తాజా కథనం ప్రకారం జగన్ కు ముఖ్యమంత్రి పదవిని కానీ ఉప ముఖ్యమంత్రి పదవిని కానీ ఇవ్వడానకి ఢిల్లీ అధిష్టానం సుముఖంగా లేదు. ఒకవేళ జగన్ అంగీకరిస్తే రాష్ట్ర కేబినెట్ లో లేదా కేంద్ర మంత్రివర్గంలో సహాయమంత్రి పదవి గానీ ఇచ్చే అవకాశం ఉంది. అధిష్టాన నిర్ణయమే శిరోధార్యం అని సెలవిస్తున్న జగన్... ఈ సాదాసీదా మంత్రి పదవులు తీసుకోడానికి సిద్ధంగా లేరు. ఈ పదవులకు అంగీకరిస్తే ముఖ్యమంత్రి పదవికి ఉన్న ద్వారాలు ఎప్పటికీ మూసుకుపోయినట్లేనని ఆయనా, ఆయన విధేయులు భావించడమే ఇందుకు కారణం. అధిష్టానం నిర్ణయం తేటతెల్లమై, దానికి జగన్ స్పందన కూడా స్పష్టమైన తరువాత సాగేదే రసవత్తర రాజకీయం.
Pages: 1 -2- News Posted: 21 October, 2009
|