'శీఘ్రం'తో సిరి జల్లు తిరుపతి : డబ్బుకు కొదువ లేని శ్రీ వేంకటేశ్వర స్వామి రోజురోజుకు మరింత ధనికుడు అవుతున్నాడు. శ్రీవారిని భక్తులు మరింత త్వరగా దర్శించుకునేందుకు ఎంతో ప్రచారంతో ప్రవేశపెట్టిన శీఘ్ర దర్శన పథకానికి స్పందన కూడా గొప్పగా ఉంది. యాత్రికులకు సంబంధించి బుధవారం సాధారణంగా రద్దీ రోజు కానప్పటికీ అక్టోబర్ 21 (బుధవారం) ఆలయానికి భారీ సంఖ్యలో యాత్రికులు వచ్చారు. వారిలో అత్యధిక సంఖ్యాకులు శీఘ్ర దర్శనాన్ని కోరుకున్నారు. ఫలితంగా కొద్ది వ్యవధిలోనే శ్రీవారికి దాదాపు రూ. 28 లక్షల మేరకు ఆదాయం వచ్చింది.
ఇది ఎలా సాధ్యమైందంటే - ఏజెంట్లకు తావు లేకుండా చేసేందుకు రూ. 100 సెల్లార్, రూ. 200 అర్చనానంతర దర్శనం (ఎఎడి) విధానానికి స్వస్తి చెప్పి రూ. 300 శీఘ్ర దర్శనం పద్ధతిని తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) ప్రవేశపెట్టింది. 'యాత్రికులకు నష్టం కలిగిస్తూ దళారులు రమారమి 15 వేల సెల్లార్, ఎఎడి టిక్కెట్లను అక్రమంగా చేజిక్కించుకుని విక్రయిస్తున్నారు' అని టిటిడి అధికారి ఒకరు తెలియజేశారు. శీఘ్ర దర్శనం విధానంతో ఈ ఆదాయం నేరుగా తిరుమలేశుని ఖజానాకు వెళుతుంది. ఈ విధానం కింద భక్తులు రోజూ ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు తెరచి ఉండే కౌంటర్లలో నేరుగా టిక్కెట్లు కొనుగోలు చేయవచ్చు. ఈ టిక్కెట్ల విక్రయం కోసం టిటిడి నాలుగు కౌంటర్లను ఏర్పాటు చేసింది.
ఢిల్లీ, అహ్మదాబాద్ నగరాలలోని స్వామి నారాయణ్ ఆలయాల నుంచి వచ్చిన భక్తులకు టిటిడి చైర్మన్ డి.కె. ఆదికేశవులు నాయుడు మొదటి బ్యాచ్ టిక్కెట్లను విక్రయించారు. 'ఏజెంట్ల వ్యవస్థను నిర్మూలించడం, యాత్రికులకు కష్టం లేకుండా, సులభంగా దర్శనం జరిగేట్లు చూడడం ఈ శీఘ్ర దర్శనం లక్ష్యం' అని డికె వివరించారు.
Pages: 1 -2- News Posted: 22 October, 2009
|