చెలరేగుతున్న 'చంద్రులు' (డి.వి.రాధాకృష్ణ)
హైదరాబాద్ : రాష్ట్ర అసెంబ్లీకి మధ్యంతర ఎన్నికలు వచ్చేస్తాయని, అందలాన్ని ఐదేళ్ళ కన్నా ముందుగానే అధిరోహించవచ్చని ఒక చంద్రుడు జిత్తులమారి ఎత్తులు వేస్తున్నారు. బతిమాలినా, బామాలినా, అరిచి గోలపెట్టినా ఫలితం రాకపోవడంతో బెదరించి, భయపెట్టి, హుంకరించి ఏదో ఒకలా రాష్ట్రాన్ని విడగొట్టుకోవాలని మరో చంద్రుడు యత్నాలు చేస్తున్నారు. దొరికిన ప్రతి అవకాశాన్నీ వినియోగించుకొని లక్ష్యం నెరవేర్చుకోవాలని రకరకాల వ్యూహాలను వీరిద్దరూ రచిస్తున్నారు. రాష్ట్రంలో మహానేతను కోల్పోయి, సరైన దిశా నిర్దేశం చేసే నాథుడు కరవై 'ఎవరికి వారే యమునా తీరే' చందంగా కుంటెద్దుబండిని లాక్కొస్తున్న కాంగ్రెస్ పార్టీ మీద ఎలాగైనా పై చేయి సాధించాలని ఒక చంద్రుడు పావులు కదుపుతున్నారు. కాంగ్రెస్ అధిష్టానం నుంచి, రాష్ట్ర నాయకత్వం వరకూ ఎవ్వరినీ వదలకుండా ప్రతి ఒక్కరినీ ఏకి పారేస్తూ అనుకున్నది సాధించాలని మరో చంద్రుడు ఎత్తులు వేస్తున్నారు. 'సింహం నిద్రపోతుంటే చిట్టెలుక నాట్యం చేసిన' చందంగా ఉంది రాష్ట్రంలో తాజా పరిస్థితి.
కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో రెండోసారి కూడా ఒంటి చేత్తో అధికారం కట్టబెట్టిన వైఎస్ రాజశేఖరరెడ్డి హఠాన్మరణంతో ఈ చంద్రులిద్దరికీ మళ్ళీ కొత్త సత్తువ వచ్చింది. ఆ పార్టీలో నెలకొన్న అనిశ్చితి, అయోమయాల మూలంగా రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు వస్తాయని ఒకరు ఎదురుతెన్నులు చూస్తున్నారు. ఒకే ఒక్క శాతం ఓట్లతో గత ఎన్నికల్లో వెనుకబడ్డ తాము ఇప్పుడైనా అధికారపక్షం అనిపించుకోకపోతామా అని ఆయన ఎదురు చూస్తున్నారు. తామేది చెప్పినా విన్నట్లే విని ముసి ముసి నవ్వులతో మూలన పడేసిన 'రాజు' మరణానంతరమైనా లక్ష్యం సాధించాలన్న మంత్రాగాన్ని మరొకరు చేస్తున్నారు.
ముఖ్యంగా ముఖ్యమంత్రి విషయంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న అనిశ్చితి, అయోమయాన్ని చంద్రులిద్దరూ తమకు అనుకూలంగా మలచుకొనేందుకు పావులు కదుపుతున్నారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్టు భవన్ లో బుధవారం జరిగిన టిడిపి రాష్ట్ర కార్యవర్గ ప్రమాణ స్వీకారం సందర్భంగా ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పార్టీ శ్రేణులు, నాయకులను ఉద్దేశించి మధ్యంతర ఎన్నికల ప్రస్తావన ప్రముఖంగా తీసుకువచ్చారు. రాజకీయాల్లో అసలే ఆయన చాణక్యనీతిని ప్రదర్శిస్తారన్న పేరుంది. వైఎస్ రాజశేఖరరెడ్డి లాంటి సమఉజ్జీని మట్టి కరిపించేందుకు గతంలో బాబు చేసిన యత్నాలు సరైన ఫలితాలు ఇవ్వలేదు. రాజశేఖరరెడ్డి మరణానంతరం తన ఎత్తులను అంతే స్థాయిలో తిప్పికొట్టగల సత్తా ఉన్న నాయకులు ప్రస్తుతం రాష్ట్ర కాంగ్రెస్ లేరన్న ప్రగాఢ విశ్వాసంతోనే చంద్రబాబు మధ్యంతర ఎన్నికల ప్రస్తావన తీసుకువచ్చారన్న భావన కలుగుతోంది. వైఎస్ రాజశేఖరరెడ్డి లేని లోటు కాంగ్రెస్ పార్టీలో స్పష్టంగా కనబడుతోందని, నిన్నటి వరకూ వైఎస్ ఇప్పుడు రోశయ్య, రేపు మరెవరు సిఎంగా ఉంటారో అన్నారని, మధ్యంతర ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు చంద్రబాబు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ పాత సంప్రదాయమే మళ్ళీ తెరమీదికి వస్తోందన్నది చంద్రబాబు విశ్లేషణగా ఉంది.
మహారాష్ట్ర, హర్యా, అరుణాచల్ ప్రదేశ్ లలో మొన్న జరిగిన ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వస్తాయంటురన్నారని, తాజా పరిణామాలను ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుంటూ, ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని చంద్రబాబు పార్టీ శ్రేణులను ఉత్సాహపరచడం గమనార్హం. అంటే ఆ మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ హవా నడిస్తే అదే ఊపులో అనిశ్చితిలో ఉన్న మన రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ మధ్యంతర ఎన్నికలకు వెళ్ళవచ్చనే ధోరణి చంద్రబాబులో కనిపిస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ బలహీనపడిందని, టిడిపి బలంగా ఉందని కూడా ఆయన ఈ సందర్భంగా పేర్కొనడం గమనార్హం.
Pages: 1 -2- News Posted: 22 October, 2009
|