ఆ టీచర్ 'సీరియల్ కిల్లర్' మంగళూరు : 'సీరియల్ కిల్లర్'గా మారిన టీచర్ మోహన్ కుమార్ బారిన పడి 22, 35 సంవత్సరాల మధ్య వయస్సున్న యువతులు 18 మంది ప్రాణాలు కోల్పోయారు. మైసూరు, మడికెరి, హస్సన్, బెంగళూరులలోని బస్ స్టేషన్లు, కొల్లూరు ఆలయం అతని కార్యకలాపాలకు నిలయం అవుతుండేవి. యౌవనంలో ఉన్న, అవివాహితులైన మహిళలకు వల వేసి, వివాహం చేసుకుంటానని వాగ్దానంతో వారితో 'సెక్స్' జరిపి ఆతరువాత గర్భ నివారణ చర్యగా సైనైడ్ తీసుకునేలా చేసి హతమార్చడం అతని పద్ధతి.
జూన్ 17 నుంచి జాడ తెలియకుండా పోయిన బంట్వాల్ లోని బరిమారు వాసి అనిత (22) కేసును దర్యాప్తు చేయనారంభించిన పోలీసులకు వారు ఆశించినదాని కంటే ఎక్కువ సమాచారమే లభించింది. కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (ఎస్ఐటి - సిట్) అనిత మొబైల్ ఫోన్ ఆచూకీ తీసింది. అనిత ఫోన్ నుంచి వెళ్ళిన కాల్స్ ను క్షుణ్ణంగా పరిశీలించినప్పుడు వారికి మరొక యువతి గురించి తెలియవచ్చింది. ఆమె కూడా అదృశ్యమైనట్లు ఫిర్యాదు అందింది. జాడ తెలియకుండా పోయిన ఒక యుతి సెల్ ఫోన్ ను ఉపయోగిస్తున్న ఒక వ్యక్తి ఆచూకీని సిట్ కనుగొనగలిగింది.
ఆ వ్యక్తి ఇచ్చిన సమాచారంతో పుత్తూరు అసిస్టెంట్ ఎస్ పి చంద్రగుప్త నాయకత్వంలోని పోలీసు బృందం మంగళూరు సమీపంలోని డేరాలకట్టెలో మోహన్ కుమార్ ను అతని నివాసంలో పట్టుకోగలిగారు. పియుసి వరకు చదివిన మోహన్ కుమార్ 1980లో తాత్కాలిక పద్ధతిపై ఒక ప్రాథమిక పాఠశాలలో టీచర్ గా ప్రభుత్వ సర్వీసులో చేరాడని ఎస్ పి ఎ.ఎస్. రావు తెలియజేశారు. ఉద్యోగంలో చేరడం, ఉద్వాసనకు గురి కావడం, జిల్లాలో అనేక ప్రదేశాలకు బదలీ అవుతుండడం వంటివి 23 ఏళ్ళ పాటు సాగిన తరువాత అతను 2003లో ఉద్యోగానికి రాజీనామా చేశాడు.
మూడు సార్లు వివాహం చేసుకున్న మోహన్ 1987లో తాను వివాహం చేసుకున్న మొదటి భార్యకు విడాకులు ఇచ్చాడు. అతను ప్రస్తుతం రెండవ భార్యతో ఉప్పలలోను, మూడవ భార్యతో డేరాలకట్టెలోను నివసిస్తున్నాడు. అతని నేరస్థ జీవితం 2000లో మొదలైంది. ఆ సంవత్సరం అతను తనతో వివాహానికి రత్న అనే యువతిని ప్రలోభపెట్టాడు. ఆమె నిరాకరించడంతో మోహన్ ధర్మశాల వద్ద నేత్రావతి వంతెనపై నుంచి ఆమెను కిందకు నెట్టివేయడానికి ప్రయత్నించాడు. అయితే, తగినన్ని సాక్ష్యాధారాలు లేని కారణంగా కోర్టు అతనిని నిర్దోషిగా పేర్కొంటూ విడుదల చేసిందని ఎస్ పి తెలిపారు.
Pages: 1 -2- News Posted: 22 October, 2009
|