సింహాన్ని పెంచుకోండి! చండీగఢ్ : కుక్క లేదా పిల్లి కన్నా పెద్దదైన, భయపెట్టగల జంతువును పెంచుకోవాలని చూస్తున్నారా? అలా అయితే మీకు పంజాబ్ ప్రభుత్వం నుంచి ఒక శుభవార్త. పులి లేదా ఏనుగు వంటి వన్యమృగం దేనినైనా పెంచుకునే అవకాశం కల్పిస్తోంది పంజాబ్ ప్రభుత్వం. అయితే, ఆ వన్యమృగాన్ని జూ నుంచి మీరు ఇంటికి తీసుకువెళ్ళజాలరు.
ఛత్ బీర్లోని మహీంద్ర చౌధురి జూలాజికల్ పార్క్ తో సహా రాష్ట్రంలోని ప్రధాన జంతు ప్రదర్శన శాలల (జూల)లోని వన్యమృగాలను, పక్షులను దత్త తీసుకోవడానికి రాష్ట్ర వాసులకు అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్నది. (ఛత్ బీర్ లోని జూలాజికల్ పార్క్ ఛత్ పీర్ జూగా ప్రసిద్ధికెక్కింది.) ఛత్ బీర్ జూ కాకుండా లూధియానా, భటిండా, పాటియాలా నగరాలలో మూడు చిన్న జూలు, లూధియానా - చండీగఢ్ రోడ్డుపై నీలన్ వద్ద లేళ్ళ పార్కు, పాటియాలాలో పక్షుల అభయారణ్యం ఉన్నాయి.
పంజాబ్ వన్యమృగాల సంరక్షణ శాఖ చీఫ్ కన్జర్వేటర్ ఆర్.కె. లూనా 'ఐఎఎన్ఎస్' విలేఖరితో మాట్లాడుతూ, 'విద్య, వినోద అవసరాల కోసం ఈ జూలు, లేళ్ళ పార్కులు వన్య మృగాలను పెంచుతున్నాయి. మేము అక్టోబర్ 7న ఈ దత్తత పథకాన్ని ప్రారంభించాం. ఈ పథకం కింద ఏ వ్యక్తి అయినా, ట్రస్ట్ అయినా, సంస్థ అయినా ఈ జూలలోని జంతువులను లేదా పక్షులను దత్తత తీసుకోవచ్చు' అని చెప్పారు. 'మేము తీవ్ర ఆర్థిక సంక్షోభంతో సతమతం అవుతున్నాం. ఈ జంతువుల పెంపకం వ్యయం చాలా సార్లు మా బడ్జెట్ ను మించిపోతున్నది. కాగా, ఇది పవిత్ర కార్యం. ఈ అమాయక, నోరులేని జీవాలకు సేవ చేయడానికి సమాజానికి దీని వల్ల అరుదైన అవకాశం లభిస్తుంది' అని ఆయన చెప్పారు.
దేశంలోని పెద్ద జంతు ప్రదర్శనశాలలలో ఛత్ బీర్ జూ ఒకటి. ఛత్ బీర్ అభయారణ్యంలో 202 హెక్టార్ల విస్తీర్ణంలో ఇది ఉన్నది. ఈ అరణ్యం ఒకప్పుడు పాటియాలా మహారాజు వేటకు ఉపయోగపడేది. ఈ జూలో సుమారు వెయ్యి వన్య మృగాలు, పక్షులు ఉన్నాయి. లూధియానా జూ పులుల సఫారీకి ప్రసిద్ధి చెందింది. ఇది 15 హెక్టార్లలో విస్తరించి ఉంది. ఇక 14 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న పాటియాలా జూలో 12 జాతుల లేళ్ళు, కోతులు, మొసళ్ళు, రకరకాల పక్షులు ఉన్నాయి. భటిండా జూ రక్షిత అటవీ ప్రాంతంలో 13 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్నది.
Pages: 1 -2- News Posted: 23 October, 2009
|