జగన్... గురిపెట్టిన గన్ హైదరాబాద్ : కాంగ్రెస్ గర్భంలో అణగిపోయి ఉన్న నిశ్శబ్ధం బద్దలయ్యింది. ఉపరితలంపై ఇంతకాలం సాగిన ఉరుముల గర్జనలు మూగపోయాయి. ఒక్కసారి... అదీ అరగంట సేపు జరిగిన సమావేశం రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయ ముఖచిత్రాన్ని సమూలంగా మార్చివేసింది. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ తనయుడు జగన్మోహన రెడ్డి భేటీ అయిన తరువాత కాంగ్రెస్ నాయకులు అందరికీ అంటే జగన్ వీర విధేయులకు, జగన్ వ్యతిరేకులుగా ప్రచారం పొందిన సీనియర్లకు కూడా చాలా స్పష్టమైన సంకేతాలే అందాయి. ముఖ్యమంత్రి పదవిపై దాదాపు అరవై రోజులకు పైగా జరిగిన రసాభాస నాటకానికి తెరపడింది.
సోనియాగాంధీతో సమావేశం అనంతరం కడప ఎంపీ మొట్టమొదటిసారిగా మీడియాతో మాట్లాడిన ప్రతీ మాటా ఆంధ్రరాష్ట్ర భవిష్యత్ రాజకీయ పోకడలనే సూచించింది. దానిలో తన పాత్ర చాలా కీలకమైందనే విషయాన్ని చాలా స్పష్టంగా కాంగ్రెస్ నాయకులందరికీ అర్ధమయ్యే రీతిలోనే సూచించారు. మేడమ్ (సోనియా గాంధీ) ప్రాధాన్యాలలో జగన్ కు సముచిత స్థానమే ఉందనే దృశ్యాన్ని ధీమాగానే ఆవిష్కరించారు. 'మేడమ్ నిర్ణయమే శిరోధార్యమని, తానెప్పుడూ ముఖ్యమంత్రి పదవి అడగలేదని' అన్న జగన్ మాటల వెనుక ఉన్న అంతరార్ధం ఒకటే ఇంతకాలం రకరకాలుగా ప్రకటనలు గుప్పించి తనను ఇరుకున పెట్టడానికి తీవ్ర ప్రయత్నాలు చేసిన వారి ఆటలు మేడమ్ దగ్గర సాగలేదని, సాగబోవని చెప్పడం. జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలని అనడమే అధిష్టానాన్ని ధిక్కరించడమని, సోనియాగాంధీకి ఎదురుతిరగడమని, కాంగ్రెస్ పార్టీని చీల్చడమని వచ్చిన కథనాలను, ఏర్పడిన అభిప్రాయాలను తుడిచిపెట్టడం. అలా అని తాను ఆ పదవికి అనర్హుడిని కానని కూడా జగన్ అన్యాపదేశంగా పేర్కొన్నారు. వయసు చిన్నది కాబట్టి ఇప్పుడు ఆ పదవిని తనకు మేడమ్ ఇవ్వలేదనే భావనను బలంగానే కలిగించారు.
Pages: 1 -2- News Posted: 23 October, 2009
|