పేదల పెద్ద మనసు కర్నూలు : వారికి చదువూసంధ్యా లేదు! కెమేరాల ముందు ఫోజులిచ్చే అలవాటు లేదు. గోరంత చేసి... కొండంతగా మీడియా ముందు సొంత డప్పు కొట్టుకోలేరు! 'సాయం' కోసమంటూ 'స్టార్ షో'లు పెట్టరు. జోలె పట్టే గుణం అంతకంటే లేదు. ముఖ్యమంత్రిని కలిసి తాము ఎంతో గొప్పగా నిధులు ఇస్తున్నట్లు ప్రకటనలు చేయలేరు. మీడియాకు ముఖాలు చూపి... చెక్ బుక్ లు ప్రదర్శించే స్థాయి, తెలివి తేటలు లేనేలేవు. వారికి తెలిసిందల్లా... ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం. తమకు ఉన్నంతలోనే ఎదుటి వారికి కొంత 'కలిమి'ని పంచడం. అందులోనూ వారు సాదాసీదా గృహిణులు... తమ కుటుంబాలు గడవడం కోసం కూలీనాలీ చేసుకునే మనుషులు. వారిలో పాల విక్రేతలు, కూరగాయలు అమ్మేవారు, చిన్నా చితకా వ్యాపారాలు చేసే వారు ఉన్నారు.
వీరందరిదీ ఒకటే కులం, ఒకటే ఊరు కానే కాదు. కానీ వారందరినీ మానవతాసూత్రం బంధించింది. వరదల ప్రభావానికి మునిగిన కర్నూలు ప్రజల్ని ఆదుకోవాలని ప్రేరేపించింది. ఇందుకోసం వీరు శ్రమదానం చేయడమే కాకుండా, 25 లక్షల రూపాయలను విరాళంగా ప్రకటించారు. పత్రికలు, మీడియాకు తెలియని ఈ దాతృత్వాన్ని ప్రదర్శించింది - కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలోని పొదుపు లక్ష్మీ సమాఖ్య మహిళలు. పెద్ద స్థాయిలో పారితోషకాలు తీసుకునే నటీనటులు, ప్రభుత్వాల నుంచి వందల కోట్లు రాయితీలు పొందే పారిశ్రామిక వేత్తలు, బ్యాంక్ ల్లో లెక్కల్లేని నల్ల దనాన్ని దాచిన సంపన్నులు వరదల బాదితుల పట్ల చూపిన జాలీ, దయ కన్నా వీరి సాయం ఎంతో విలువైనది. అత్యవసర సహాయం పూర్తైన తర్వాత బాగా దెబ్బతిన్న గ్రామాలను గుర్తించి పక్కా ఇళ్ళు, ఇతర సౌకర్యాలు కల్పించాలని పొదుపు మహిళలు నిర్ణయించుకున్నారని సమాఖ్య సలహాదారు విజయభారతి చెప్పారు. గ్రామాల పున: నిర్మాణానికి ఉన్నతాధి కారులు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
Pages: 1 -2- News Posted: 24 October, 2009
|