రోశయ్య... వేసేనా వేటు? హైదరాబాద్ : కాంగ్రెస్ అధిష్టానం ఆశీస్సులతో ముఖ్యమంత్రి పదవిలో 'ఇబ్బందులు' లేకుండా కుదురుకున్న రోశయ్య.. మంత్రి వర్గంపై తన పట్టు పెంచుకునేందుకు మంత్రి వర్గ పునర్వ్యస్థీకరణకు వ్యూహరచన చేస్తున్నారు. బహిరంగంగానే తన నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేసిన మంత్రులు కొండా సురేఖ, పిల్లి సుభాష్ చంద్రబోస్ లను కేబినెట్ నుంచి తప్పించే అవకాశం ఉందని భావిస్తున్నారు. జగన్ కు ముఖ్యమంత్రి పదవి దక్కని పక్షంలో రోశయ్య కేబినెట్ తో కొనసాగలేమని కొండాసురేఖ వ్యాఖ్యానించారు. తమకు అధిష్టానం అంటే ఏమిటో తెలియదని, తెలిసిందల్లా వైఎస్ మాత్రమేనని మరో మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ పేర్కొన్నారు.
రోశయ్య ముఖ్యమంత్రిగా కొనసాగిన పక్షంలో మంత్రులుగా పనిచేయబోమన్న వారి గురించి కొద్ది రోజుల క్రితం రోశయ్యతో ప్రస్తావించగా, వారి రాజీనామాలను ఆమోదించడానికి తనకు సమస్య లేదన్నారు. అయితే 'ఎవరినీ తొలగించవద్దు. కొత్తవారిని మంత్రులుగా తీసుకోవడం మీ కున్న ప్రత్యేక అధికారం' అని జగన్ వర్గం ఇస్తున్న సందేశానికి ముఖ్యమంత్రి ఎలా స్పందింస్తారన్నది వేచి చూడాలి. కేబినెట్ లో సీఎంతో సహా మొత్తం 35 మంది ఉన్నారు. మరో 10 మందిని మంత్రులుగా చేర్చుకునేందుకు అవకాశం ఉంది. జగన్ కు మార్గదర్శకునిగా వ్యవహరిస్తున్న కేవీపీ రామచంద్రరావు జగన్ అనుకూల మంత్రులను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారని వినికిడి. హైకమాండ్ ఆదేశం మేరకు 34 మంది మంత్రులుగా తిరిగి ప్రమాణ స్వీకారం చేసినందున... వారంతా ముఖ్యమంత్రిగా రోశయ్యను అంగీకరించినట్టేనన్న వాదాన్ని ముందుకు తెస్తున్నారు.
Pages: 1 -2- News Posted: 26 October, 2009
|