'మావో'లకు టైగర్లతో లింక్ విశాఖపట్నం : నక్సలైట్లు విదేశాల నుంచి ఆయుధాలను సమకూర్చుకుంటున్నారని కేంద్ర హెమ్ శాఖ మంత్రి పి. చిదంబరం చెప్పినప్పుడు కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా ఉందని చాలా మంది భావించారు. ఎందుకంటే ఎర్ర గెరిల్లాలు తమిళ టైగర్లతో కలసి దేశంలోని దక్షిణ, మధ్య ప్రాంతాలలో సంయుక్తంగా శిక్షణ శిబిరాలను, సమావేశాలను నిర్వహిస్తున్నారని కేంద్ర గూఢచారి సంస్థలు తాజా దాఖలాల ఆధారంగా ఇంతకుముందే వెల్లడి చేశాయి.
అంటే మావోయిస్టులు ఎల్ టిటిఇ నుంచి వ్యూహాత్మక మద్దతు, శిక్షణ పొందుతున్నారని ఇది సూచిస్తున్నదా? మావోయిస్టులు, తమిళ టైగర్లు ఒకే కోవకు చెందినవారా? వేగుల సమాచారాన్నే విశ్వసించేటట్లయితే, ఆ ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తుంది. మావోయిస్టులు, టైగర్ల మధ్య గల ప్రమాదకర పొత్తు గురించిన కీలకమైన సమాచారాన్ని మన దేశ అత్యున్నత గూఢచారి విభాగం సేకరించినట్లు అభిజ్ఞ వర్గాలు చెబుతున్నాయి.
వాస్తవానికి, తమిళ టైగర్లు భారతీయ సముద్ర జలాలలోకి అక్రమంగా ప్రవేశించడంపై ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు, ఛత్తీస్ గఢ్, ఒరిస్సా రాష్ట్రాలను కేంద్ర గూఢచారి సంస్థ ఉన్నతాధికారులు హెచ్చరించారు కూడా. సుశిక్షితులైన 12 మంది తమిళ టైగర్ల బృందం మావోయిస్టులతో చేతులు కలిపేందుకు భారతదేశంలోకి ఇటీవల అక్రమంగా ప్రవేశించినట్లు ఆ వర్గాలు తెలియజేశాయి. 'వారు మూడు బృందాలుగా చీలిపోయి కేరళ మీదుగా ఉత్తర కోస్తా ఆంధ్రలోకి ప్రవేశించారు. వారిలో ఒక బృందం విజయనగరం ప్రాంతంలో సురక్షిత స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు' అని ఆ వర్గాలు తెలిపాయి. ఎల్ టిటిఇ కేడర్ అక్రమంగా ప్రవేశించవచ్చునని తూర్పు తీరంలోని రాష్ట్రాలను గూఢచారి సంస్థలు అప్రమత్తం చేసిన నేపథ్యంలో ఈ సమాచారం వెల్లడి కావడం గమనార్హం.
అయితే, పేలుడు వస్తువుల విస్ఫోటంలోను, ఆత్మాహుతి బాంబు దాడులలోను తమిళ టైగర్లకు గల ప్రావీణ్యం భద్రతా సంస్థలను ఎక్కువగా కలవరపరుస్తున్నది. 'మావోయిస్టుల అటవీ యుద్ధ వ్యూహానికి టైగర్ల నైపుణ్యం తోడైతే ఎలా ఉంటుందో ఊహించండి. ఇది భద్రతా సంస్థల పాలిట ప్రమాదకర కూటమి అవుతుంది' అని విశ్లేషకులు అంటున్నారు.
Pages: 1 -2- News Posted: 26 October, 2009
|