లావైపోతున్న యువత హైదరాబాద్ : భారీ వేతనం, భత్యాలతో లాభసాటి ఉద్యోగం మిమ్మల్ని వరిస్తే దానితో పాటు వచ్చే 'అదనపు బ్యాగేజి' మోయడానికి కూడా సిద్ధపడవలసి ఉంటుంది. 'ప్రపంచ స్థూలకాయ దినోత్సవం' సందర్భంగా ఒత్తిడితో కూడిన కెరీర్ లు, నిశ్చలన జీవన సరళుల వల్ల యువజనులలో అధిక సంఖ్యాకులు స్థూలకాయులు అవుతున్నారని, సంబంధిత ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని హైదరాబాద్ నగర వైద్యులు పేర్కొంటున్నారు. 'సాఫ్ట్ వేర్ రుగ్మత (సిండ్రోమ్)'గా ఇప్పుడు పేర్కొంటున్న ఈ సమస్యతో నగరంలో డాక్టర్లను ఆశ్రయిస్తున్న యువజనుల సంఖ్య వాస్తవానికి గడచిన ఐదేళ్లలో 25 శాతం పెరిగింది.
'అధిక సంఖ్యాక ఉద్యోగాలు యువజనులను గంటల తరబడి కంప్యూటర్ ముందే కూర్చోబెడుతున్నాయి. వ్యాయామానికి వారికి తీరికే చిక్కడం లేదు. దీనితో స్థూలకాయులు అవుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. తమ ఉద్యోగులు సేద తీరడానికి అత్యధునాతన జిమ్ లు, ఇతర సౌకర్యాలు ఉన్నాయని చాలా కార్పొరేట్ సంస్థలు గొప్పగా చెప్పుకుంటున్నప్పటికీ ఆ సౌకర్యాలను ఉపయోగించుకోవడానికి వారికి తరచు సమయమే దొరకడం లేదు' అని బేరియాట్రిక్ సర్జన్ డాక్టర్ నందకిషోర్ దుక్కపాటి తెలిపారు.
సగటు వ్యక్తికి ఒక మోస్తరు కార్యకలాపాల స్థాయి ఆధారంగా రోజుకు సుమారు 1800 నుంచి 2000 కిలో కేలరీల వరకు ఆహారం కావలసి ఉంటుందని, అయితే, ఒకే చోట ఉండిపోయే జీవన సరళితో సాగిపోతున్న యువజనుల సంఖ్య పెరుగుతుండడంతో కేలరీల ఆవశ్యకత కూడా సుమారు 1500 కిలో కేలరీలకు తగ్గిపోయిందని వైద్యులు చెబుతున్నారు. 'జనం తమకు కావలసిన పరిమాణం కన్నా ఎక్కువ కేలరీలనే ఇప్పటికీ తీసుకుంటున్నారు. ఖర్చు చేసేందుకు భారీగా జీతాలు వస్తుండడంతో మద్యం, జంక్ ఫుడ్ తీసుకోవడం యువజనులకు మరింత సులభమైంది. ఇప్పుడు నా వద్దకు వచ్చే రోగులలో 35 శాతం మంది 30 ఏళ్లలోపు వారే' అని డాక్టర్ దుక్కపాటి చెప్పారు.
స్థూలకాయుల సంఖ్య పెరిగిపోతుండడంతో అదనపు కండను తొలగించేందుకు శస్త్రచికిత్స కోసం చాలా మంది అడుగుతున్నారు. 'అయితే, బేరియాట్రిక్ సర్జరీకి అంతా అర్హులు కారు. స్థూలకాయం సమస్య తీవ్రంగా, ఆరోగ్యానికి హానికరంగా ఉన్నప్పుడే ఈ సర్జరీ చేయగలం' అని డాక్టర్ దుక్కపాటి తెలిపారు.
Pages: 1 -2- News Posted: 26 October, 2009
|